డీజీపీని కలసి వినతిపత్రం అందజేస్తున్నా ఎర్రోళ్ల శ్రీనివాస్
Errolla Srinivas| ఆకేరు న్యూస్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో దళితులు, గిరిజనులపై జరుగుతున్న దాడులు, అరికట్టేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ డీజీపీని కోరారు. ఈ మేరకు మాజీ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్, రాంబాల్ నాయక్, మాజీ కమిషన్ సభ్యుడు సాల్మన్ రాజ్ తదితరులతో కలిసి డీజీపీని కలసి వినతిపత్రం అందజేశారు.
9,102 కేసులు.. 32 కేసుల్లోనే శిక్షలు
తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ అక్టోబర్ 1న విడుదల చేసిన నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో గత మూడేళ్లలో 9,102 అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని ఎర్రోళ్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. వీటిలో 159 మంది ఎస్సీలు, 54 మంది ఎస్టీలు కలిపి మొత్తం 213 మంది హత్యకు గురయ్యారని తెలిపారు. అలాగే 1,305 మంది బాలికలు, మహిళలపై లైంగిక దాడులకు సంబంధించిన కేసులు నమోదైనట్లు వివరించారు. మొత్తం కేసుల్లో కేవలం 32 కేసుల్లోనే శిక్షలు పడటం ఆందోళనకరమని పేర్కొన్నారు.
కేసుల నమోదు, దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణలో జాప్యం కారణంగా బాధితులకు సకాలంలో న్యాయం అందడం లేదని ఆయన ఆరోపించారు. చట్ట ప్రకారం అందాల్సిన పరిహారం కోసం కూడా బాధితులు ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందన్నారు.
వరుస దాడులపై ఆందోళన
గత కొన్ని వారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో దళితులు, గిరిజనులపై జరిగిన దాడులను ఈ సందర్భంగా ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రస్తావించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల శివారులో దళిత యువకుడు చిలుక ఉదయ్‌పై దాడి జరిగినట్లు తెలిపారు.
నల్గొండ జిల్లా చింతపల్లి మండలం పీకే మల్లెపల్లిలో గ్రామసభలో మాట్లాడుతున్న గనిపాల్లి మాధవిని కులం పేరుతో దూషించి దాడి చేసినట్లు పేర్కొన్నారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లిలో గ్రామ ఆలయంలోకి దళిత కుటుంబాన్ని రాకుండా అడ్డుకున్న ఘటనను కూడా ప్రస్తావించారు.
బతుకమ్మ వేడుకల సందర్భంగా మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కోనేపల్లి, కుచరాలతో పాటు తూప్రాన్ మండలం కిష్టాపూర్, శివ్వంపేట మండలం నవాబ్‌పేటలో దళితులపై దాడులు జరిగినట్లు తెలిపారు. మనోహరాబాద్ మండలంలో దళిత సర్పంచ్ చిత్ర రఘుపై దాడి ఘటనలో కేసు నమోదైనప్పటికీ, నాలుగు రోజులైనా నిందితులను అరెస్ట్ చేయలేదని ఆరోపించారు. దీంతో బాధితులు అక్టోబర్ 22న మెదక్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేయాల్సి వచ్చిందన్నారు.
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తల్లపేటలో బతుకమ్మ వేడుకల సందర్భంగా గిరిజన మహిళ, సర్పంచ్ కుర్సింగ కళావతితో పాటు ఉప సర్పంచ్‌పై సర్కిల్ ఇన్స్పెక్టర్ దాడి చేశారన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
పోలీసులపై చర్యలు తీసుకోవాలి
దళితులు, గిరిజనులు గ్రామసభల్లో మాట్లాడినా, ఆలయాల్లోకి వెళ్లినా, పండుగల్లో పాల్గొన్నా దాడులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు పోలీస్ స్టేషన్లకు వెళ్లినప్పుడు ఫిర్యాదుల స్వీకరణ, ఎఫ్ఐఆర్ నమోదు, దర్యాప్తులో జాప్యం జరగకుండా చూడాలని కోరారు. ఫిర్యాదు అందిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని, నిర్లక్ష్యం చేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
దళితులు, గిరిజనులపై దాడులను అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం కఠినంగా వ్యవహరించాలని, అట్రాసిటీ కేసుల్లో బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎర్రోళ్ల శ్రీనివాస్ డీజీపీని కోరారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

