TGPSC Recruitment Details
* TGPSC సరికొత్త యాక్షన్ ప్లాన్..
* నెల రోజుల్లోనే చేతికి ఉద్యోగ పత్రాలు
* నవంబర్లోనే పీసీబీ భర్తీ.. డిసెంబర్లో R&B AEE
ఆకేరు న్యూస్, డెస్క్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఉద్యోగ నియామక ప్రక్రియలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. పరీక్షల నిర్వహణ నుంచి ఫలితాల వెల్లడి, అభ్యర్థుల ఎంపిక, చివరికి నియామక పత్రాల అందజేత వరకు గతంలో నెెలల తరబడి సాగే సుదీర్ఘ ప్రక్రియకు కమిషన్ స్వస్తి పలికింది. అభ్యర్థుల సమయాన్ని ఆదా చేయడంతో పాటు పారదర్శకతను పెంచేందుకు “పరీక్ష ముగిసిన నెల రోజుల్లోపే నియామకాలు” అనే సరికొత్త వ్యూహాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోంది.
* పీసీబీ (PCB) పోస్టుల భర్తీకి సర్వం సిద్ధం..
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TSPCB)లోని వివిధ కీలక ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
అనలిస్ట్ గ్రేడ్-2 : ఈ పోస్టులకు సంబంధించిన రాత పరీక్ష ఈ నెల 24న ప్రశాంతంగా పూర్తయింది.
సహాయ పర్యావరణ ఇంజినీర్ (AEE ) : ఈ పరీక్షను ఈ నెల 26న కమిషన్ విజయవంతంగా నిర్వహించింది. కమిషన్ రూపొందించిన కొత్త క్యాలెండర్ ప్రకారం, ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీ (Initial Key)ని రెండు లేదా మూడు రోజుల్లోనే అధికారిక వెబ్సైట్లో విడుదల చేయనున్నారు.
ప్రాథమిక కీపై అభ్యర్థుల నుంచి ఆన్లైన్ ద్వారా అభ్యంతరాల స్వీకరణకు కేవలం 3 రోజుల సమయం మాత్రమే ఇస్తారు. అభ్యంతరాల పరిశీలన పూర్తి కాగానే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా తుది కీ (Final Key)తో పాటు మెరిట్ జాబితాను ఒకేసారి విడుదల చేసేందుకు TGPSC శరవేగంగా అడుగులు వేస్తోంది.
ఈ వేగవంతమైన చర్యల వల్ల పీసీబీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు నవంబరు రెండో లేదా మూడో వారం నాటికే తమ కొలువుల్లో చేరేలా కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
* నవంబర్లోనే R&B AEE పరీక్షలు..
రోడ్లు, భవనాల శాఖలో (R&B) అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టుల భర్తీకి కూడా ఇదే వేగవంతమైన సూత్రాన్ని అమలు చేయనున్నారు. పరీక్షల తేదీ నవంబరు 6 మరియు 7 తేదీల్లో R&B AEE రాత పరీక్షలు జరగనున్నాయి.
నియామకాల గడువు పరీక్ష ముగిసిన వెంటనే మూల్యాంకన ప్రక్రియను వేగవంతం చేసి, నవంబరు ఆఖరు లేదా డిసెంబరు మొదటి వారంలోపే విజేతలకు నియామక పత్రాలు అందజేయాలని ప్రణాళిక సిద్ధం చేశారు.
* నిరుద్యోగుల్లో వ్యక్తమవుతున్న హర్షం..
గతంలో ఏళ్ల తరబడి ఫలితాల కోసం, పోస్టింగ్‌ల కోసం వేచి చూసి నిరాశకు గురైన ఉద్యోగార్థులకు TGPSC తీసుకుంటున్న ఈ నిర్ణయాలు పెద్ద ఊరటనిస్తున్నాయి. పరీక్ష రాసిన నెల రోజుల్లోనే ఫలితాలు తేలి, ఉద్యోగంలో చేరే అవకాశం రావడం వల్ల అభ్యర్థులలో నూతన ఉత్సాహం నిండుతోంది. భవిష్యత్తులో రాబోయే అన్ని నోటిఫికేషన్లకు కూడా ఇదే శైలిలో వేగవంతమైన విధానాన్ని అమలు చేయాలని కమిషన్ యోచిస్తోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

