17వ ఆవిర్భావ సభకు సంబంధించిన గోడపత్రాలు, కరపత్రాన్ని ఆవిష్కరణ
* తెలంగాణ ప్రజా ఫ్రంట్
* ఈ నెల 31న కొత్తగూడెంలో 17వ ఆవిర్భావ సభ
Telangana Praja Front| ఆకేరు న్యూస్, పాలకుర్తి: తెలంగాణలో సహజ వనరులు, భూములపై పెట్టుబడిదారుల ఆధిపత్యం పెరుగుతోందని తెలంగాణ ప్రజా ఫ్రంట్ నాయకులు ఆరోపించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగడం లేదని విమర్శించారు. ఈ నెల 31న కొత్తగూడెంలో నిర్వహించనున్న తెలంగాణ ప్రజా ఫ్రంట్ 17వ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
పాలకుర్తి మండల కేంద్రంలోని సర్దార్ పాపారాయుడు విగ్రహం వద్ద మంగళవారం తెలంగాణ ప్రజా ఫ్రంట్ జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సభకు సంబంధించిన గోడపత్రాలు, కరపత్రాలను ఆవిష్కరించారు.
ప్రభుత్వ విధానాలపై విమర్శలు
ఈ సందర్భంగా తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి పాకాల వెంకన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి కడమంచి యాకస్వామి (సంతోష్) మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజలు చేసిన పోరాటాలు, అమరుల త్యాగాల ఆశయాలకు భిన్నంగా ప్రస్తుత విధానాలు కొనసాగుతున్నాయని విమర్శించారు. కోస్తాంధ్ర భూస్వామ్య, పెట్టుబడిదారీ ఆధిపత్యం తిరిగి పెరుగుతోందని ఆరోపించారు.
రియల్ ఎస్టేట్, పరిశ్రమల పేరుతో వేలాది ఎకరాల భూములు రాజకీయ నాయకులు, పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని సహజ వనరులు ప్రజల ప్రయోజనాలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రజా సమస్యలను పరిష్కరించాలి
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అప్పుల భారాన్ని పెంచుతోందని నాయకులు విమర్శించారు. పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం అందుబాటులో లేకపోవడం, నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉండటంతో యువత ఉపాధి కోసం వలస వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని, కార్మికులు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
సభకు తరలిరావాలని పిలుపు
నిజమైన ప్రజాస్వామిక, ఆత్మగౌరవ తెలంగాణ సాధన లక్ష్యంగా ఈ నెల 31న కొత్తగూడెంలో నిర్వహించే తెలంగాణ ప్రజా ఫ్రంట్ 17వ ఆవిర్భావ సభకు విద్యార్థులు, మేధావులు, కార్మికులు, రైతులు, ప్రజాసంఘాల నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా కమిటీ సభ్యులు మారబోయిన కొమురయ్య, లోకనాథం, ఎలాబోయిన సుధాకర్, కట్ల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

