Indian Para Athlete Neeraj Yadav
* పారా ఛాంపియన్ నీరజ్ యాదవ్ ఆత్మహత్య
* డోపింగ్ ఆరోపణలు.. మనస్తాపంతో బలవన్మరణం
ఆకేరు న్యూస్, డెస్క్ : భారత క్రీడారంగంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మూడుసార్లు ఆసియా పారా గేమ్స్ (Asian Para Games) ఛాంపియన్, భారత స్టార్ పారా అథ్లెట్ నీరజ్ యాదవ్ (42) ఆత్మహత్య చేసుకున్నారు. ఢిల్లీలోని తన నివాసంలో ఆయన విషం తాగి ప్రాణాలు విడిచారు. ఈ విషాదకర సంఘటనను ఇండియన్ పారా-అథ్లెటిక్స్ జాతీయ ప్రధాన కోచ్ ఎన్. సత్యనారాయణ (S. Satyanarayana) అధికారికంగా ధృవీకరించారు. అయితే, ఆయన ఈ కఠిన నిర్ణయం తీసుకోవడానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని, పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారని కోచ్ తెలిపారు.
* వైకల్యాన్ని జయించి.. ఛాంపియన్‌గా నిలిచి..
ఉత్తరప్రదేశ్‌కు చెందిన నీరజ్ యాదవ్ జీవితం ఆరంభం నుంచీ సవాళ్లతోనే సాగింది. ఏడేళ్ల వయసులోనే పోలియో బారిన పడి వీల్చేర్కే పరిమితమైన నీరజ్, మనోధైర్యంతో క్రీడారంగంలోకి అడుగుపెట్టాడు. దాదాపు ఏడేళ్ల పాటు వీల్చేర్ టెన్నిస్ ఆడిన నీరజ్, 2015లో అథ్లెటిక్స్ వైపు మళ్లాడు. 2015 ఢిల్లీ స్టేట్ అథ్లెటిక్స్ మీట్లో షాట్‌పుట్, జావెలెన్, డిస్కస్ త్రో విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించి తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు.
* ఆసియా పారా గేమ్స్‌లో పతకాల పంట..
2018 ఆసియన్ పారా గేమ్స్ (ఇండోనేషియా) : జావెలెన్ త్రో F55 విభాగంలో 29.84 మీటర్ల ఆసియా రికార్డుతో (Asian Record) పసిడి పతకం సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచాడు.
2022/2023 ఆసియన్ పారా గేమ్స్ (హాంగ్జౌ, చైనా) : ఈ పోటీల్లో డబుల్ గోల్డ్ సాధించాడు. డిస్కస్ త్రో (F54/55/56), జావెలెన్ త్రో (F55) విభాగాల్లో రెండు స్వర్ణ పతకాలు ముద్దాడి చరిత్ర సృష్టించాడు.
అంతర్జాతీయ వేదికలపై : 2016 ఫజ్జా గ్రాండ్ ప్రిక్స్‌లో వెండి పతకం, 2022 మొరాకో గ్రాండ్ ప్రిక్స్‌లో కొత్త జాతీయ రికార్డుతో (National Record) స్వర్ణం సాధించి భారత క్రీడారంగం కీర్తిని అంతర్జాతీయంగా చాటాడు.
* మానసిక ఆందోళన, డోపింగ్ ఆరోపణలు..
నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) సస్పెన్షన్ కారణంగా నీరజ్ తీవ్ర ఆర్థిక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. డోపింగ్ ఆరోపణల వల్ల 2026 ఆసియా పారా గేమ్స్‌కు దూరం కావడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ దారుణ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. అంతర్జాతీయ వేదికలపై భారత త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ఎగురవేసిన అరుదైన పారా అథ్లెట్ నీరజ్ యాదవ్ అకాల మరణం పట్ల క్రీడాలోకం, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

