వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేతా
* బడి బయట పిల్లలను గుర్తించాలి
* విద్యార్థుల గైర్హాజరుపై నిఘా
* వరంగల్ కమిషనర్ ఎన్. శ్వేత
ఆకేరు న్యూస్, హనుమకొండ: మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి అన్ని ప్రభుత్వ శాఖలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత పిలుపునిచ్చారు. యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడేందుకు పాఠశాల స్థాయి నుంచే అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి తిరిగి పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
హనుమకొండ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధ్యక్షతన బుధవారం మాదకద్రవ్యాల నియంత్రణపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ శ్వేత మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాల్లో విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించాలని తెలిపారు.
బడి బయట పిల్లలు
నయీ కిరణ్, విద్యాప్రేరణ వంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో అవగాహన పెంచడంతో పాటు, చదువుకు దూరమైన పిల్లలను గుర్తించి తిరిగి పాఠశాలల్లో చేర్పించాలని సీపీ శ్వేత సూచించారు. విద్యార్థులు మధ్యలోనే చదువు మానేయకుండా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు.
ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాల ద్వారా బాలల సంరక్షణ, రక్షణ, పునరావాసానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. బాలల హక్కులను పరిరక్షిస్తూ బడి బయట పిల్లలను తిరిగి విద్యావ్యవస్థలోకి తీసుకురావడంలో సంబంధిత శాఖలు చొరవ చూపాలని కోరారు.
మాదకద్రవ్యాల నియంత్రణ పోలీసు శాఖ ఒక్కటే చేపట్టాల్సిన బాధ్యత కాదని, విద్య, ఎక్సైజ్, అటవీ శాఖలతో పాటు విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, తల్లిదండ్రులు సమష్టిగా కృషి చేయాలని స్పష్టం చేశారు.
గైర్హాజరుపై నిఘా
పాఠశాలల్లో విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించేందుకు ప్రహరీ క్లబ్‌లను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు. చదువు మానేసిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు.
తరచూ పాఠశాలలకు గైర్హాజరవుతున్న విద్యార్థులను గుర్తించి, వారు బడికి రాకపోవడానికి గల కారణాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. మాదకద్రవ్యాల నియంత్రణపై నిర్వహించే సమావేశాలకు ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల సంఘాల ప్రతినిధులు తప్పనిసరిగా హాజరయ్యేలా ముందస్తు సమాచారం అందించాలని సూచించారు.
అధికారులు హాజరు
ఈ సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ నవీన్‌కుమార్, డీఆర్వో శ్రీనివాస్, జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.వి. గిరిరాజ్ గౌడ్, హనుమకొండ, పరకాల ఆర్డీవోలు వెంకటేష్, డి.ఎస్. వెంకన్నతో పాటు ఎక్సైజ్, అటవీ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ పాఠశాలల సంఘాలు, విద్యాసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

