Chandrapur Tiger Attack Worker Death
* జునోనా అటవీ ప్రాంతంలో వెదురు నరికేందుకు వెళ్లిన కూలిపై దాడి
ఆకేరు న్యూస్, చంద్రపూర్ : చంద్రపూర్ జిల్లాలోని అటవీ అభివృద్ధి సంస్థ (FDCM) పరిధిలోని జునోనా అటవీ ప్రాంతంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అడవిలో వెదురు నరికే పనికి వెళ్లిన ఓ కూలిపై పెద్దపులి అకస్మాత్తుగా దాడి చేసి పొట్టనబెట్టుకుంది. ఈ ఘటనతో అటవీ కూలీలలో తీవ్ర కలకలం రేపింది.
* వివరాల్లోకి వెళ్తే..
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బాలాఘాట్ ప్రాంతానికి చెందిన కలమ్సింగ్ ఉయికే (48) జునోనా అటవీ ప్రాంతంలో వెదురు నరికే కూలీగా ఉపాధి పొందుతున్నాడు. ఎప్పటిలాగే తోటి కూలీలతో కలిసి అడవిలోకి వెళ్లిన కలమ్సింగ్ ఉయికే.. వెదురు నరికే పనిలో నిమగ్నమై ఉన్న సమయంలో పెద్దపులి ఒక్కసారిగా ఆయనపై పంజా విసిరింది. పులి అకస్మాత్తుగా దాడి చేయడంతో తేరుకునే లోపే ఆయన తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
* భయాందోళనలో అటవీ కూలీలు..
సంఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే అటవీశాఖ అధికారులు మరియు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రాంతంలో పులుల సంచారం ఎక్కువగా ఉండటంతో, అడవిలోకి వెళ్లే వెదురు నరికే కూలీలు, అటవీ కార్మికులు ప్రాణభయంతో వణికిపోతున్నారు.
అటవీ శాఖ అధికారులు ఈ ఘటనపై తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అలాగే మృతుని కుటుంబానికి తగిన నష్టపరిహారం అందించాలని తోటి కూలీలు డిమాండ్ చేస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

