School Social Audit Telangana
* తదుపరి చర్యలకు సమగ్ర శిక్ష డైరెక్టర్ ఆదేశాలు
* హెచ్ఎంలకు కీలక సూచనలు..
* ఫిర్యాదులపై 48 గంటల్లో విచారణ..
* నవంబర్ 25లోగా పబ్లిక్ హియరింగ్స్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాష్ట్రంలోని సమగ్ర శిక్ష పరిధిలో ఉన్న 4,620 పాఠశాలల్లో నిర్వహించిన సోషల్ ఆడిట్‌పై తదుపరి చర్యలకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (CESS) ఆధ్వర్యంలో చేపట్టిన క్షేత్రస్థాయి సర్వే పూర్తికావడంతో పాఠశాలల వారీగా ఆడిట్ ఫలితాలు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ఫలితాల పరిశీలన, సమస్యల పరిష్కారం, పబ్లిక్ హియరింగ్స్ నిర్వహణ, చర్యల నివేదికల సమర్పణకు సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ Proc.Rc.No.1520/SS/T7/2023, తేదీ 30-10-2026 ద్వారా డీఈఓలు, డీపీఓలకు మార్గదర్శకాలు జారీ చేశారు.
* 5 రోజుల్లో ఎంఈఓలకు ఆడిట్ ఫలితాలు
సోషల్ ఆడిట్ ఫలితాలను సంబంధిత మండల విద్యాశాఖ అధికారులకు (ఎంఈఓలు) ఐదు రోజుల్లోగా పంపాలని జిల్లా విద్యాశాఖ అధికారులను (డీఈఓలు) ఆదేశించారు. ఎంఈఓల నుంచి ఫలితాలను అందుకున్న హెడ్మాస్టర్లు (హెచ్ఎంలు) వాటిని పాఠశాల నోటీసు బోర్డులో ప్రదర్శించాలి. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (SMC) సమావేశంలో చదివి వినిపించాలి. CESS సర్వేలో వెల్లడైన అంశాలను పాఠశాల రికార్డులతో సరిపోల్చి అవసరమైన చర్యలు తీసుకోవాలి.
* వేధింపుల ఫిర్యాదులుంటే 48 గంటల్లో విచారణ
విద్యార్థులపై లైంగిక వేధింపులు, మానసిక వేధింపులు, శారీరక దండన లేదా వివక్షకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్న పాఠశాలల విషయంలో అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలి. అలాంటి ఫిర్యాదులు అందిన పక్షంలో డీఈఓలు 48 గంటల్లో వ్యక్తిగతంగా తనిఖీ నిర్వహించి, వాస్తవాలను పరిశీలించాలి. POCSO చట్టం, జువెనైల్ జస్టిస్ చట్టం, విద్యాహక్కు చట్టం (RTE) ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలి. ఈ వివరాలతో గోప్య నివేదికను సమర్పించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
* నవంబర్ 25లోగా పబ్లిక్ హియరింగ్స్
సోషల్ ఆడిట్లో గుర్తించిన సమస్యలపై ప్రజల సమక్షంలో చర్చించి పరిష్కార మార్గాలు కనుగొనేందుకు మండలాల వారీగా పబ్లిక్ హియరింగ్స్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికను నవంబర్ 7, 2026 నాటికి ఖరారు చేయాలి. ప్రజాప్రతినిధులు, అధికారులు, SMC సభ్యులు, తల్లిదండ్రుల సమక్షంలో నవంబర్ 25లోగా ఈ కార్యక్రమాలను పూర్తి చేయాలని ఆదేశించారు.
* సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గడువులు
పాఠశాల స్థాయిలో పరిష్కరించగల ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు, ప్రథమ చికిత్స సదుపాయాలు, స్వల్ప మరమ్మతులు వంటి సమస్యలను 15 రోజుల్లోగా పరిష్కరించాలి. ఉపాధ్యాయుల కొరత, మౌలిక సదుపాయాల సమస్యలు వంటి జిల్లా స్థాయి అంశాలను 21 రోజుల్లోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి. పాఠశాల భవనాలు, మరుగుదొడ్లు, డిజిటల్ పరికరాల వంటి పెద్ద స్థాయి అవసరాలపై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు.
* డిసెంబర్ 5లోగా ATR.. 31 నాటికి కేంద్రానికి నివేదిక
పాఠశాలలు, మండలాలు, జిల్లాల స్థాయిలో తీసుకున్న చర్యలకు సంబంధించిన ఆక్షన్ టేకెన్ రిపోర్ట్ (ATR), పబ్లిక్ హియరింగ్ వివరాలను డిసెంబర్ 5, 2026 నాటికి రాష్ట్ర కార్యాలయానికి పంపాలి. హెచ్ఎంలు తీసుకున్న చర్యలను తదుపరి SMC సమావేశంలో ఆమోదించి, మినిట్స్ బుక్‌లో నమోదు చేయాలి. PM SHRI పాఠశాలలకు సంబంధించిన రికార్డులను కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. మొత్తం సోషల్ ఆడిట్ ప్రక్రియను డిసెంబర్ 31 నాటికి పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించేలా డీఈఓలు వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
* హెచ్ఎంలు తప్పనిసరిగా చేయాల్సిన పనులివే..
సోషల్ ఆడిట్ ఫలితాలు అందిన వెంటనే CESS సర్వేలో గుర్తించిన అంశాలను పాఠశాల రికార్డులతో సరిచూసుకోవాలి. ఆడిట్ ఫలితాలను నోటీసు బోర్డులో ప్రదర్శించి, SMC సమావేశంలో చదివి వినిపించాలి. ఫిర్యాదుల పెట్టె, అత్యవసర ఫోన్ నంబర్ల ప్రదర్శన, ప్రథమ చికిత్స కిట్, విద్యార్థుల భద్రతా కమిటీల ఏర్పాటు వంటి అంశాలు పూర్తిచేయాలి. పెండింగ్‌లో ఉన్న పాఠశాల స్థాయి సమస్యలను 15 రోజుల్లోగా పరిష్కరించాలి.
విద్యార్థుల భద్రత, లైంగిక లేదా మానసిక వేధింపులకు సంబంధించిన సున్నితమైన ఫిర్యాదులను మాత్రం పబ్లిక్ హియరింగ్‌లో బహిరంగంగా చదవకూడదు. వాటిని నేరుగా డీఈఓ దృష్టికి తీసుకెళ్లాలి. తీసుకున్న ప్రతి చర్యను SMC మినిట్స్ బుక్‌లో నమోదు చేసి, మండల, జిల్లా అధికారులకు ATR సమర్పణలో పూర్తి సహకారం అందించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

