Hyderabad Green Water Tankers
* ఎల్నినో ఎఫెక్ట్పై ముందస్తు జాగ్రత్తలు..
* నీటి సంరక్షణకు సీఎం రేవంత్ పిలుపు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) 37వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బోర్డు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. గత 37 ఏళ్లుగా హైదరాబాద్ ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించడంతో పాటు మురుగునీటి నిర్వహణలో బోర్డు అందిస్తున్న సేవలను సీఎం అభినందించారు. నగర అభివృద్ధి, ప్రజారోగ్యం, సమగ్ర ప్రగతిలో HMWSSB కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగర అవసరాలకు అనుగుణంగా నీటి భద్రతకు, విలువైన జల వనరుల సుస్థిర నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
* ఎల్నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి..
ఎల్నినో ప్రభావం, మారుతున్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. మంచినీటి వనరులను పరిరక్షించడంతో పాటు గృహావసరాలకు సంబంధం లేని పనులకు తాగునీటిని వినియోగించడాన్ని తగ్గించాలని సూచించారు. భవిష్యత్తులో నీటి కొరత తలెత్తకుండా ఇప్పటి నుంచే సమర్థవంతమైన ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని తెలిపారు.
* గ్రీన్ ట్యాంకర్ కార్యక్రమానికి సీఎం అభినందనలు
నీటి సంరక్షణలో భాగంగా నవంబర్ 1 నుంచి ప్రారంభమైన ‘డయల్ గ్రీన్ ట్యాంకర్ – గ్రీన్ ట్యాంకర్ ఆపరేషన్స్’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి అభినందించారు. సుస్థిర నీటి నిర్వహణ దిశగా ఇది సరైన సమయంలో చేపట్టిన కీలక కార్యక్రమమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా శుద్ధి చేసిన మురుగునీటిని (Treated Wastewater) తాగడానికి ఉపయోగించకుండా ఇతర అవసరాలకు సరఫరా చేయనున్నారు. తోటల పెంపకం, నిర్మాణ పనులు, పారిశ్రామిక కార్యకలాపాలు, పార్కుల నిర్వహణ తదితర అవసరాలకు గ్రీన్ ట్యాంకర్ల ద్వారా ఈ నీటిని వినియోగించుకోవచ్చు.
* పరిశ్రమలు, నిర్మాణ సంస్థలకు సీఎం పిలుపు..
ప్రభుత్వ శాఖలు, పరిశ్రమలు, నిర్మాణ సంస్థలు, వాణిజ్య సంస్థలు తమ అవసరాల కోసం శుద్ధి చేసిన మురుగునీటిని మరింత విస్తృతంగా ఉపయోగించుకోవాలని సీఎం కోరారు. ఇలా చేయడం వల్ల తాగునీటిపై ఆధారపడటం తగ్గడంతో పాటు ప్రజల గృహావసరాలకు మంచినీరు అందుబాటులో ఉంటుందని వివరించారు.
* నీటి సంరక్షణ అందరి బాధ్యత..
నీటి వనరులను కాపాడుకోవడం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి ఒక్కరూ సమిష్టి బాధ్యతగా స్వీకరించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సుస్థిరమైన, నీటి భద్రత కలిగిన హైదరాబాద్ నిర్మాణంలో ప్రజలు, ప్రభుత్వ శాఖలు, పరిశ్రమలు, ఇతర భాగస్వాములందరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు. కోర్ అర్బన్ రీజియన్ (CURE) ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ HMWSSB తన ప్రస్థానంలో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.

