Free Veterinary Treatment for Sheep and Goats GMPS Demand
* గొర్రెల, మేకలకు ఉచిత వైద్యం, దాణా పంపిణీ చేయాలి
* ప్రభుత్వానికి జీఎంపీఎస్ విజ్ఞప్తి
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ : రాష్ట్రవ్యాప్తంగా ఎల్-నినో’ ప్రభావం నెలకొన్న దృష్ట్యా జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మునిసిపాలిటీతో పాటు మండలంలో ‘గొర్రెలు, మేకల ఉచిత వైద్యం, దానా పంపిణీ చేయాలని జిఎంపిఎస్ జిల్లా గౌరవ అధ్యక్షులు సాదం రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
స్టేషన్ ఘన్ పూర్ పెంపకందారుల సహకార సంఘం ముఖ్య నాయకుల సమావేశం పెద్ది వెంకటయ్య అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా సాదం రమేష్ మాట్లాడుతూ.. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అక్టోబర్ 25 నుండి నవంబర్ 10వ తేదీ వరకు జనగామ జిల్లాలోని అన్ని మండలాల్లో గొర్రెల, మేకల పెంపకందారుల స్థితిగతులపై క్షేత్రస్థాయి సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
జిల్లా ఉపాధ్యక్షులు మేకల మల్లేష్ బృందంతో కలిసి గ్రామాల్లో గొల్లకురుమల పరిస్థితిని పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పెంపకందారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు వైద్యుల అందుబాటు రాహిత్యం పశువైద్యశాలల్లో డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదన్నారు. ఆసుపత్రుల్లో అవసరమైన మందులు లేకపోవడంతో ప్రైవేట్ మెడికల్ షాపుల్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
సీజనల్ వ్యాధుల నివారణ లోపం వర్షాకాలం, వాతావరణ మార్పులతో వచ్చే వ్యాధులకు ప్రభుత్వం నుండి సరైన నివారణ చర్యలు లేదా సౌకర్యాలు లభించడం లేదని ఆరోపించారు. మేత, నీటి సమస్య తీర్చేందుకు ప్రభుత్వ పోరంబోకు భూములు అందుబాటులో లేవు అన్నారు.
* ఎల్-నినోతో గొర్రెలు, మేకల పెంపకంపై ప్రభావం..
రానున్న రోజుల్లో ‘ఎల్-నినో’ ప్రభావం పడితే గొర్రెలు, మేకలకు మేత, తాగునీటి కరువు మరింత తీవ్రమయ్యే ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ పశువైద్యశాలల్లో పశువైద్యులను వెంటనే అందుబాటులో ఉంచాలన్నారు. పశువులకు అవసరమైన అన్ని రకాల మందులను ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వమే ఉచితంగా దాణా, తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. వీధి కుక్కల నుండి రక్షణ చర్యలు చేపట్టి, గొల్లకురుమలను ఆర్థికంగా ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో బండారి నర్సింహాలు, రవి, వెంకటయ్య, పరమేష్, రమేష్, శ్రీను, యాదగిరి, పెద్ది కుమార్, ఉడుత కొమురయ్య, గుంటి శ్యామ్, బండారి ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

