UPI Transactions
* అక్టోబర్‌లో 25.47 బిలియన్ లావాదేవీలు..
* నెలవారీ చెల్లింపుల విలువ రూ.31.53 లక్షల కోట్లు..
* సెప్టెంబర్‌తో పోలిస్తే 7.4 శాతం వృద్ధి
ఆకేరు న్యూస్, డెస్క్ : దేశంలో డిజిటల్ చెల్లింపుల వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా జరిగే లావాదేవీలు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. తాజాగా అక్టోబర్ నెలలో యూపీఐ లావాదేవీలు గతంలో ఎన్నడూ లేనంత స్థాయికి చేరాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. రోజువారీ సగటు లావాదేవీల విలువ తొలిసారిగా రూ.లక్ష కోట్ల మార్కును అధిగమించింది.
* రూ.31.53 లక్షల కోట్ల లావాదేవీలు
అక్టోబర్ నెలలో దేశవ్యాప్తంగా యూపీఐ ద్వారా మొత్తం 25.47 బిలియన్ లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రూ.31.53 లక్షల కోట్లకు చేరింది. సెప్టెంబర్ నెలలో రూ.29.37 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరగ్గా, అక్టోబర్‌లో వాటి విలువ 7.4 శాతం పెరిగింది. లావాదేవీల సంఖ్య కూడా సెప్టెంబర్‌తో పోలిస్తే 5.8 శాతం వృద్ధి చెందింది.
* రోజువారీ విలువ రూ.లక్ష కోట్లు దాటింది..
అక్టోబర్‌లో యూపీఐ ద్వారా రోజుకు సగటున రూ.1,01,707 కోట్ల విలువైన చెల్లింపులు జరిగాయి. సెప్టెంబర్‌లో ఈ సగటు రూ.97,913 కోట్లుగా ఉంది. దీంతో రోజువారీ సగటు లావాదేవీల విలువ తొలిసారిగా రూ.లక్ష కోట్ల మార్కును దాటింది. రోజుకు సగటున 822 మిలియన్ల లావాదేవీలు నమోదయ్యాయి.
* పండగ సీజన్ ప్రభావం
అక్టోబర్‌లో దసరా, దీపావళి పండగల నేపథ్యంలో కొనుగోళ్లు పెరగడం యూపీఐ లావాదేవీల వృద్ధికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఆన్లైన్ షాపింగ్, ఎలక్ట్రానిక్ వస్తువులు, దుస్తులు, ఇతర రిటైల్ కొనుగోళ్లతో పాటు రోజువారీ అవసరాల చెల్లింపులకు కూడా వినియోగదారులు యూపీఐని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. చిన్న దుకాణాల నుంచి పెద్ద వ్యాపార సంస్థల వరకు డిజిటల్ చెల్లింపులను స్వీకరిస్తుండటంతో యూపీఐ వినియోగం మరింత విస్తరిస్తోంది. తాజా గణాంకాలు దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థకు పెరుగుతున్న ఆదరణను స్పష్టం చేస్తున్నాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

