Telangana High Court 22A Judgment
* 22-ఏ జాబితాలో లేకుంటే రిజిస్ట్రేషన్ చేయాల్సిందే..
* సబ్రిజిస్ట్రార్లకు ఆ హక్కు లేదన్న తెలంగాణ హైకోర్టు
* తహసీల్దార్ లేఖ రాసినా రిజిస్ట్రేషన్ ఆపడం కుదరదు
* నిషేధిత జాబితా భూములపై హైకోర్టు సంచలన తీర్పు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : నిషేధిత ఆస్తుల జాబితా (సెక్షన్ 22-ఏ) పరిధిలోకి రాని భూముల రిజిస్ట్రేషన్‌ను నిలిపివేసే అధికారం సబ్ రిజిస్ట్రార్లకు ఎంతమాత్రం లేదని తెలంగాణ ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కేవలం తహసీల్దార్ లేదా దేవాదాయ శాఖ అధికారులు లేఖలు రాసినంత మాత్రాన సదరు భూముల రిజిస్ట్రేషన్లను ఆపడం సరికాదని న్యాయస్థానం తేల్చిచెప్పింది.
* కేసు వివరాలు..
నల్గొండ జిల్లా చింతపల్లి మండలానికి చెందిన సర్వే నంబర్లు 556, 557, 558, 585 లలోని కొన్ని భూములను దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ల్యాండ్ ఆఫీసర్లకు లేఖ రాశారు. ఆ భూములు శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయానికి చెందినవని, అందుకే వాటి రిజిస్ట్రేషన్ చేయవద్దని పేర్కొన్నారు.
ఈ కారణంతో స్థానిక సబ్‌రిజిస్ట్రార్ ఆ భూముల రిజిస్ట్రేషన్‌ను తిరస్కరించారు. దీనిని సవాలు చేస్తూ శీలం నిర్మల, మారుపాక వెంకట్‌రెడ్డి, విజయలక్ష్మి, వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.
* హైకోర్టు ఏమందంటే..
ఈ పిటిషన్లపై సమగ్ర విచారణ జరిపిన జస్టిస్ రేణుక యార ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్లకు చెందిన సదరు భూములు 22-ఏ నిషేధిత జాబితాలో అధికారికంగా లేనందున వాటి రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిలిపివేయడానికి వీల్లేదని తీర్పునిచ్చింది.
ఒకవేళ రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత ఆ భూముల యాజమాన్య హక్కుల (Title) పై ఏవైనా వివాదాలు ఉంటే, సంబంధిత దేవాదాయ శాఖ లేదా అధికారులు సివిల్ కోర్టు లేదా సంబంధిత ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి హక్కులను తేల్చుకోవచ్చని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి మాత్రం బాధితుల భూముల రిజిస్ట్రేషన్లను అడ్డుకోవద్దని ఆదేశించింది.
*సెక్షన్ 22-ఏ అంటే…
రిజిస్ట్రేషన్ చట్టం, 1908లోని సెక్షన్ 22-ఏ ప్రకారం ప్రభుత్వం నిషేధిత ఆస్తులు (ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, దేవాదాయ/వక్ఫ్ భూములు, సీలింగ్ భూములు) వేటికి రిజిస్ట్రేషన్లు చేయకూడదో అధికారిక నోటిఫికేషన్ ద్వారా జాబితాను రూపొందిస్తుంది.
సబ్రిజిస్ట్రార్ల పరిధి : గెజిట్ నోటిఫికేషన్ లేదా నిషేధిత జాబితాలో అధికారికంగా పొందుపరచకుండా, కేవలం అధికారులు ఇచ్చే అంతర్గత లేఖల ఆధారంగా ఆస్తుల రిజిస్ట్రేషన్లను నిలిపివేయడం చెల్లదని గతంలోనూ న్యాయస్థానాలు పలు సందర్భాల్లో స్పష్టం చేశాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

