PV Sindhu Lakshya Sen,Hylo Open 2026
* హైలో ఓపెన్ భారత్ కైవసం..
* సింధు, లక్ష్యసేన్ ఛాంపియన్లు
* ఇద్దరికీ సూపర్ 500 టైటిళ్లు
ఆకేరు న్యూస్, డెస్క్ : భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు మరోసారి తన సత్తా చాటింది. జర్మనీలో జరిగిన హైలో ఓపెన్-2026 సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో మహిళల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో డెన్మార్క్ క్రీడాకారిణి లైన్ కెజర్స్ఫెల్ట్పై వరుస గేముల్లో విజయం సాధించింది. 21-12, 21-14 స్కోరుతో ప్రత్యర్థిని ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. మరోవైపు భారత యువ షట్లర్ లక్ష్యసేన్ కూడా పురుషుల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకుని భారత విజయాన్ని రెట్టింపు చేశాడు.
* ఫైనల్లో సింధు పూర్తి ఆధిపత్యం..
మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ప్రపంచ 25వ ర్యాంకు క్రీడాకారిణి లైన్ కెజర్స్ఫెల్ట్ను ఎదుర్కొన్న సింధు.. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పాయింట్లు సాధించింది. తొలి గేమ్‌లో 39 నిమిషాల పాటు సాగిన పోరులో తన పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆరంభంలో స్కోరు 3-3తో సమమైనప్పటికీ సింధు వెంటనే పుంజుకుంది. చక్కని నెట్ ప్లేతో 8-5 ఆధిక్యంలోకి వెళ్లింది. విరామ సమయానికి 11-8తో ముందంజలో నిలిచింది.
ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగిస్తూ బ్యాక్‌హ్యాండ్ విన్నర్‌తో 17-12 ఆధిక్యాన్ని సంపాదించింది. ప్రత్యర్థికి తిరిగి పుంజుకునే అవకాశం ఇవ్వకుండా తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లోనూ సింధు తన దూకుడును కొనసాగించింది. 10-6తో ఆధిక్యంలోకి వెళ్లిన ఆమె.. ఆ తర్వాత 17-11తో ముందంజలో నిలిచింది. అద్భుతమైన నెట్ ప్లేతో ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టింది. ఎటాకింగ్ రిటర్న్‌లతో పాయింట్లు సాధిస్తూ రెండో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా గెలుచుకుంది.
* ఈ ఏడాది రెండో టైటిల్..
ఇటీవల వరుస వైఫల్యాలను ఎదుర్కొంటున్న సింధు.. హైలో ఓపెన్‌లో మాత్రం తన పాత ఆటతీరును ప్రదర్శించింది. ఈ టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఒక్క గేమ్ కూడా కోల్పోకుండా ప్రత్యర్థులను ఓడించింది. 31 ఏళ్ల సింధుకు ఈ సీజన్లో ఇది రెండో టైటిల్. అంతకుముందు జులైలో జరిగిన జపాన్ ఓపెన్‌లోనూ ఆమె విజేతగా నిలిచింది. హైలో ఓపెన్ విజయం సింధు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది.
* లక్ష్యసేన్ కూడా ఛాంపియనే..
పురుషుల సింగిల్స్‌లో భారత షట్లర్ లక్ష్యసేన్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో ఇండోనేషియాకు చెందిన జొనాథన్ క్రిస్టీపై 21-17, 21-10తో విజయం సాధించాడు. హోరాహోరీగా సాగిన తొలి గేమ్‌లో లక్ష్యసేన్ ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్నప్పటికీ 21-17తో గేమ్‌ను గెలుచుకున్నాడు. రెండో గేమ్‌లో మరింత దూకుడుగా ఆడి 21-10తో ప్రత్యర్థిని చిత్తు చేశాడు. ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లాండ్ టైటిల్‌ను తృటిలో చేజార్చుకున్న లక్ష్యసేన్.. హైలో ఓపెన్‌లో మాత్రం పట్టు వదలకుండా ఆడి విజేతగా నిలిచాడు. ఇలా ఒకే టోర్నీలో మహిళల, పురుషుల సింగిల్స్ విభాగాల్లో భారత షట్లర్లు టైటిళ్లు గెలుచుకోవడం విశేషం. సింధు, లక్ష్యసేన్ విజయాలతో భారత బ్యాడ్మింటన్ అభిమానుల్లో ఆనందం నెలకొంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

