Police Sports Meet 2026
* ముగిసిన 5వ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్ – 2026
Police Sports Meet 2026| ఆకేరు న్యూస్, హనుమకొండ: వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన 5వ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్ – 2026 ఘనంగా ముగిసింది. నవంబర్ 3 నుంచి 5వ తేదీ వరకు నిర్వహించిన ఈ క్రీడా పోటీల్లో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ పోలీస్ యూనిట్లకు చెందిన 1,535 మంది పురుష, మహిళా పోలీస్ క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
పలు వేదికల్లో క్రీడా పోటీలు
హనుమకొండలోని జేఎన్ఎస్ స్టేడియం, స్కిల్ స్టోర్క్ స్కూల్, కిట్స్ కళాశాల క్రీడా ప్రాంగణం, పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోని రాణి రుద్రమదేవి హాలులో వివిధ క్రీడా పోటీలను నిర్వహించారు. వాలీబాల్, బాస్కెట్‌బాల్, ఖో-ఖో, కబడ్డీ, హాకీ, ఫుట్‌బాల్, సెపక్ తక్రా తదితర క్రీడల్లో పోలీస్ సిబ్బంది తమ ప్రతిభను చాటుకున్నారు.
క్రీడలతో శారీరక దృఢత్వం
ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్టీ జోన్-1 ఐజీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. పోలీస్ సిబ్బందికి విధి నిర్వహణలో శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ ఎంతో అవసరమని అన్నారు. ఇలాంటి క్రీడా పోటీలు సిబ్బందిలో క్రీడాస్ఫూర్తి, ఐకమత్యం, జట్టుగా పనిచేసే లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. జాతీయ స్థాయి క్రీడల్లో ప్రతిభ కనబరిచిన పోలీస్ క్రీడాకారులకు వార్షిక ఇంక్రిమెంట్లు కూడా లభిస్తాయని పేర్కొన్నారు.
విజేతలకు బహుమతుల ప్రదానం
అనంతరం వివిధ క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులు, జట్లకు బహుమతులు, ట్రోఫీలను అందజేసి అభినందించారు. మూడు రోజుల పాటు క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించిన వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్‌తో పాటు ఇతర పోలీస్ అధికారులను ఐజీ అభినందించారు.
క్రీడాకారులకు సీపీ అభినందనలు
ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పోలీస్ క్రీడాకారులు క్రమశిక్షణతో పోటీల్లో పాల్గొని తమ క్రీడాస్ఫూర్తిని చాటారని అన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బంది ప్రజాసేవలోనూ అదే ఉత్సాహంతో ముందుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. పోటీల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన కమిషనరేట్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత, వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్, అడిషనల్ డీసీపీ (అడ్మిన్) రాయల ప్రభాకర్ రావు, ఇతర అడిషనల్ డీసీపీలు, సీఐలు, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

