ఫాతిమానగర్‌లో అగ్నిప్రమాదం
* షార్ట్ సర్క్యూట్‌తో అద్దె ఇల్లు పూర్తిగా కాలిబూడిద
* రూ.2 లక్షల ఆస్తి నష్టం
Kazipet Fire Accident| ఆకేరు న్యూస్, కాజీపేట: హనుమకొండ జిల్లా కాజీపేట పరిధిలోని ఫాతిమానగర్‌లో గురువారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ అద్దె ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో సుమారు రూ.2 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధిత కుటుంబం తెలిపింది.
ధర్మసాగర్ మండలం రాపాకపల్లికి చెందిన ఇమ్మడి విజయ్‌కుమార్ తన పిల్లల చదువుల కోసం కాజీపేటలోని ఫాతిమానగర్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. గురువారం ఉదయం అనూహ్యంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఇంట్లో మంటలు వ్యాపించాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో ఇంట్లోని వస్తువులు, గృహోపకరణాలు, దుస్తులు పూర్తిగా కాలిపోయాయి.
ఈ ప్రమాదంలో ఇంట్లోని సామగ్రి అంతా అగ్నికి ఆహుతి కావడంతో కుటుంబం కట్టుబట్టలతో మిగిలిపోయింది. సుమారు రూ.2 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల చదువుల కోసం పట్టణంలో అద్దెకు ఉంటున్న తమ కుటుంబం ఒక్కసారిగా నిరాశ్రయులైందని కన్నీరుమున్నీరయ్యారు.
ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, దాతలు స్పందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని విజయ్‌కుమార్ వేడుకుంటున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.

