Jaipur Road Accident
* తాగుబోతు కారు డ్రైవర్ బీభత్సం..
* ఇద్దరు యువకులు దుర్మరణం
ఆకేరు న్యూస్, జైపూర్ / ఆమేర్ : రాజధాని జైపూర్ పరిధిలోని ఆమేర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో మద్యం మత్తు, అతివేగం మరోసారి నిండు ప్రాణాలను బలిగొన్నాయి. పూటుగా మద్యం తాగి కారు నడుపుతున్న డ్రైవర్ రెచ్చిపోయి, ముందు వెళ్తున్న వాహనాలను అడ్డగోలుగా ఢీకొట్టాడు. ఈ భీకర రోడ్డు ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో ముగ్గురు మోటార్ సైకిల్ ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.
* ఇద్దరు యువకులు మృతి..
ఈ దుర్ఘటనలో సాహిల్ (25), షోయబ్ (26) ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద తీవ్రత కారణంగా స్కూటీపై ఉన్న ఇద్దరూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు.
* వారం రోజుల్లో చెల్లెలి పెళ్లి.. ఇంట్లో విషాదం..
మృతుడు సాహిల్ ఇంట్లో సరిగ్గా ఏడు రోజుల్లో తన చెల్లెలి పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లి పనులతో కళకళలాడాల్సిన ఇంట్లో చావు కబురు వినిపించడంతో కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. మరో మృతుడు షోయబ్‌కు కేవలం నాలుగు నెలల క్రితమే బాబు పుట్టాడు. నిండు నూరేళ్లు జీవించాల్సిన తండ్రి అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఆ పసికందు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
* ముగ్గురికి తీవ్ర గాయాలు..
కారు ఢీకొన్న ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న సోహైల్, కలీముద్దీన్, తరుణ్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
* ప్రమాదం జరిగిందిలా..
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఆమేర్ ప్రాంతంలో ఓ కారు అతివేగంతో, నియంత్రణ లేకుండా దూసుకెళ్లింది. కారు నడుపుతున్న డ్రైవర్ పూర్తిగా మద్యం మత్తులో ఉన్నాడు. ముందుగా ఎదురుగా వస్తున్న స్కూటీని కారు బలంగా ఢీకొట్టింది. దీంతో స్కూటీపై ఉన్న సాహిల్, షోయబ్ రోడ్డుపై ఎగిరిపడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.
అయినా కారు ఆగకుండా ముందుకు దూసుకెళ్లి మరో మోటార్ సైకిల్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ రెండో ప్రమాదంలో మోటార్ సైకిల్‌పై ప్రయాణిస్తున్న సోహైల్, కలీముద్దీన్, తరుణ్ తీవ్ర గాయాలతో రోడ్డుపై పడిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
* స్థానికుల ఆగ్రహం.. కఠిన చర్యలకు డిమాండ్
మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ అమాయకుల ప్రాణాలను బలిగొంటున్న ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, మృతుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు సాహసంతో కారు డ్రైవర్ అయాన్ (భిల్వాడ నివాసి), అతని సహచరుడు సాగర్ సోలంకిలను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

