హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
* నీరు వృధా చేయకుండా సాగుకు అందించాలి
* ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
ఆకేరు న్యూస్, కమలాపూర్: ప్రభుత్వం ప్రకటించిన క్రాప్ హాలిడే నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోస్తే రైతులు తిరిగి సాగు చేసుకునే అవకాశం ఉంటుందని, ఈ అంశంపై ప్రభుత్వం పునరాలోచించాలని సూచించారు.
గురువారం హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం గూడూరు గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో, కమలాపూర్‌లో డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏఎంసీ చైర్మన్ ఝాన్సీ రాణితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ వ్యవసాయ విధానాలపై విమర్శలు చేశారు.
క్రాప్ హాలిడే వెనక్కి తీసుకోవాలి
నీరు అందుబాటులో ఉన్నప్పటికీ క్రాప్ హాలిడే ప్రకటించడం రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని కౌశిక్ రెడ్డి అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాలు, రెండు పట్టణాల రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. క్రాప్ హాలిడే కొనసాగిస్తే రైతులకు ఎకరాకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
సముద్రంలో కలుస్తున్న నీరు
కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని వినియోగించుకోకుండా సముద్రంలోకి వదిలేస్తున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద రోజుకు 25 వేల క్యూసెక్కుల చొప్పున నీరు సముద్రంలో కలుస్తోందని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఎన్నడూ లేని విధంగా గోదావరి, కృష్ణా నదుల నుంచి సుమారు 1,000 టీఎంసీల నీటిని కాంగ్రెస్ ప్రభుత్వం వృథా చేసిందని విమర్శించారు.
2026 జూన్ 9న కేటీఆర్, కేసీఆర్ నాయకత్వంలో వేలాది మంది రైతులతో కలిసి కన్నెపల్లి పంప్‌హౌస్ వద్దకు వెళ్లి నీటిని ఎత్తిపోసి సాగుకు అందించాలని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రోజుకు 3 టీఎంసీల చొప్పున కాళేశ్వరం నీటిని ఎత్తిపోస్తే రైతులు తిరిగి పంటలు సాగు చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు.
రూ.500 బోనస్ అమలు చేయాలి
రైతుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడితే వారి ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పంటలకు రూ.500 బోనస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

