Telangana DSC Teachers
* ఇంక్రిమెంట్ నష్టపోతున్న ఉపాధ్యాయులు
* మూడు జిల్లాల్లోనే ప్రొబేషన్ డిక్లరేషన్ పూర్తి..
ఆకేరు న్యూస్, డెస్క్ : తెలంగాణలో 2024 డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయుల ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియలో జాప్యం జరుగుతోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రొబేషన్ డిక్లరేషన్, సర్వీస్ రెగ్యులరైజేషన్‌కు సంబంధించి స్పష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ.. కొన్ని జిల్లాల్లో అధికారుల తీరుతో ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. ఈ అంశంపై పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో వాటి అమలులో జాప్యం జరుగుతోందని ఉపాధ్యాయ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
పోలీస్ వెరిఫికేషన్‌తో కొత్త సమస్య
ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియలో భాగంగా పలువురు జిల్లా విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయుల వివరాలను పోలీస్ వెరిఫికేషన్ కోసం పంపిస్తున్నారు. అయితే నియామక సమయంలోనే పోలీస్ వెరిఫికేషన్ పూర్తి కావాల్సి ఉండగా, ప్రొబేషన్ డిక్లరేషన్ దశలో మరోసారి ఈ ప్రక్రియను చేపట్టడంపై ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రొబేషన్ డిక్లరేషన్‌కు, సర్వీస్ రెగ్యులరైజేషన్‌కు మధ్య తేడా ఉందని.. ఈ రెండింటినీ ఒకటిగా పరిగణించడం వల్ల అనవసరమైన జాప్యం జరుగుతోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అధికారుల అవగాహన లోపం, నిర్లక్ష్యం కారణంగా తమ సర్వీస్‌కు సంబంధించిన అంశాలు పెండింగ్‌లో పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
15 రోజులు గడిచినా పూర్తికాని ప్రక్రియ
పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈ అంశంపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి 15 రోజులు గడిచినా.. ఇప్పటివరకు కేవలం మూడు జిల్లాల్లోనే ప్రక్రియ పూర్తయినట్లు సమాచారం. ములుగు, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్ జిల్లాల్లో ప్రొబేషన్ డిక్లరేషన్‌కు సంబంధించిన ప్రక్రియ ముగిసినట్లు ఉపాధ్యాయ వర్గాలు పేర్కొంటున్నాయి. మిగిలిన జిల్లాల్లో ఇంకా జాప్యం కొనసాగుతోందని చెబుతున్నారు. ప్రొబేషన్ డిక్లరేషన్ ఆలస్యం కావడంతో ఇప్పటికే ఒక నెల ఇంక్రిమెంట్ కోల్పోయామని పలువురు ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఈ నెలలోనైనా వేతన బిల్లులు సిద్ధమయ్యేలా ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతున్నారు.
ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి
పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వులను అన్ని జిల్లాల్లో ఒకే విధంగా అమలు చేయాలని బాధిత ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఆదేశాల అమలులో జాప్యం చేస్తున్న జిల్లా విద్యాశాఖ అధికారుల తీరుపై ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 2024 డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులందరికీ సకాలంలో ప్రొబేషన్ డిక్లరేషన్ జరిగేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ కమిషనర్‌ను కోరుతున్నారు. ప్రభుత్వం, విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈ సమస్యపై తక్షణమే స్పందించి పెండింగ్‌లో ఉన్న ప్రక్రియను పూర్తి చేయాలని ఉపాధ్యాయులు ఆశిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

