Kaleshwaram Project CM Review
* మూడు బ్యారేజీల పునరుద్ధరణకు సీఎం ఆదేశాలు
* ఈ ఏడాది చివరిలో పనులు
* కాళేశ్వరం బ్యారేజీలకు రిపేర్లు
* NDSA గ్రీన్ సిగ్నల్ దిశగా
ఆకేరు న్యూస్, డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్టులో దెబ్బతిన్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. మూడు బ్యారేజీలను తిరిగి సురక్షిత వినియోగంలోకి తీసుకువచ్చేందుకు జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) మార్గదర్శకాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, డ్యామ్ సేఫ్టీ నిపుణుల సూచనల మేరకే పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదని స్పష్టం చేశారు.
రూ.4,193 కోట్లతో పునరుద్ధరణ ప్రతిపాదనలు
మూడు బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించి మంత్రులు, నీటిపారుదల శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పునరుద్ధరణ పనుల కోసం సుమారు రూ.4,193 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు. నిర్మాణ లోపాల కారణంగా చేపట్టాల్సిన మరమ్మతుల ఖర్చును నిర్మాణ సంస్థలే భరించేలా, అదనపు పనుల వ్యయాన్ని ప్రభుత్వం భరించేలా ప్రతిపాదనలు రూపొందించినట్లు వివరించారు. మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిన్న అనంతరం మూడు బ్యారేజీల స్థితిగతులపై ప్రభుత్వం సమగ్ర అధ్యయనం చేయించింది. జాతీయ స్థాయి నిపుణులు, కేంద్ర ప్రభుత్వ సాంకేతిక సంస్థల సహకారంతో అవసరమైన పరిశోధనలు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. పునరుద్ధరణకు సంబంధించిన ప్రాథమిక ప్రణాళికలకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.
మేడిగడ్డ నీటిని లిఫ్ట్ చేయడంపై వివరణ
మేడిగడ్డ వద్ద నీరు ఉన్నప్పటికీ ప్రభుత్వం దానిని వినియోగించడం లేదంటూ జరుగుతున్న ప్రచారంపై ముఖ్యమంత్రి మంత్రులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం బ్యారేజీ పరిస్థితుల్లో అక్కడి నీటిని సాంకేతికంగా లిఫ్ట్ చేయడం సాధ్యం కాదని నీటిపారుదల శాఖ ఇంజనీర్లు వివరించారు. మేడిగడ్డ నుంచి నీటిని లిఫ్ట్ చేసి ఎల్లంపల్లికి తరలించాలంటే మధ్యలో ఉన్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీల గేట్లను మూసివేయాల్సి ఉంటుందని అధికారులు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అయితే నిర్మాణపరమైన లోపాలు ఉన్న నేపథ్యంలో ఆ రెండు బ్యారేజీల గేట్లను తెరిచే ఉంచాలని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించిన విషయాన్ని ప్రస్తావించారు. బ్యారేజీల భద్రతకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించి నీటిని తరలించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.
దేవాదుల, సీతారామ ప్రాజెక్టులతో పెరిగిన నీటి వినియోగం
దిగువ గోదావరి జలాలను వృథా కాకుండా వినియోగించుకునేందుకు దేవాదుల, సీతారామ ఎత్తిపోతల పథకాల ద్వారా ప్రభుత్వం చర్యలు తీసుకుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల పరిధిలో సాగు, తాగునీటి అవసరాలకు నీటిని అందించినట్లు వివరించారు. గత ప్రభుత్వ హయాంలో దేవాదుల ప్రాజెక్టు ద్వారా ఏడాదికి సగటున 9.57 టీఎంసీల నీటిని మాత్రమే లిఫ్ట్ చేయగా, గత మూడేళ్లలో సగటున 18.13 టీఎంసీలకు పెరిగిందని పేర్కొన్నారు. ఇది గతంతో పోలిస్తే 89 శాతం అధికమని తెలిపారు. అక్టోబర్ నాటికి దేవాదుల ద్వారా 16.71 టీఎంసీలు, సీతారామ ప్రాజెక్టు ద్వారా 8.10 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసినట్లు వెల్లడించారు. మొత్తంగా 24.81 టీఎంసీల గోదావరి జలాలను వినియోగించుకున్నట్లు వివరించారు.
ప్రాణహిత ప్రాజెక్టుపై సీఎం వ్యాఖ్యలు
గత ప్రభుత్వ నిర్ణయాల వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. బ్యారేజీల నిర్మాణంలో జరిగిన లోపాలు, వాటి పర్యవసానాలను సమీక్షలో ప్రస్తావించారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి ప్రాణహిత ప్రాజెక్టును పూర్తిచేసి ఉంటే కరువు పరిస్థితుల్లోనూ నీటి ఇబ్బందులు తగ్గేవని అన్నారు. ప్రాణహిత జలాలను తక్కువ ఖర్చుతో ఎల్లంపల్లికి తరలించే అవకాశం ఉండేదని పేర్కొన్నారు. మరోవైపు ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వ్యవసాయ విస్తీర్ణం పెరిగిందని, వరి దిగుబడిలో దేశస్థాయిలో రికార్డు సాధించామని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.
ఈ ఏడాది చివరిలోగా పనులు ప్రారంభించాలని ఆదేశం
మూడు బ్యారేజీల పునరుద్ధరణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, పనుల్లో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఈ నెలాఖరులోగా పునరుద్ధరణ పనులకు అవసరమైన తుది అనుమతులు పొందేందుకు ప్రయత్నించాలని ఆదేశించారు. ఈ ఏడాది చివరిలోగా పనులు ప్రారంభించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. బ్యారేజీల నీటి వినియోగ సామర్థ్యాన్ని తిరిగి అందుబాటులోకి తీసుకురావడం, వాటి రక్షణ చర్యలను రెండు వేర్వేరు దశలుగా చేపట్టాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, నిర్మాణ సంస్థలు, రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారుల మధ్య సమన్వయం ఉండాలని చెప్పారు. అవసరమైన అనుమతులను త్వరితగతిన పొందేందుకు కేంద్ర సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్, టన్నెల్స్ అండ్ సేఫ్టీ కార్యదర్శి కల్నల్ పరీక్షిత్ మెహ్రా, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

