Telangana Cabinet Meeting CM Revanth Reddy Review
* డిసెంబర్ 8న క్లైమేట్ కాంక్లేవ్
* 200 మంది నిపుణులతో ప్రత్యేక సదస్సు
* గ్లోబల్ సమ్మిట్‌కు భారీ ఏర్పాట్లు
* వాతావరణ మార్పులపై ప్రత్యేక చర్చ
ఆకేరు న్యూస్, డెస్క్: వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026లో డిసెంబర్ 8న తెలంగాణ క్లైమేట్ కాంక్లేవ్ నిర్వహించనున్నారు. వాతావరణ మార్పుల వల్ల వ్యవసాయం, పశుసంరక్షణ, తాగునీటి భద్రతతో పాటు పర్యావరణంపై పడుతున్న ప్రభావాలను ఈ సదస్సులో చర్చించనున్నారు. తక్షణ చర్యలు, దీర్ఘకాలిక పరిష్కారాల రూపకల్పనకు ఈ సమావేశాన్ని వేదికగా ఉపయోగించుకోనున్నారు.
డిసెంబర్ 7 నుంచి 9 వరకు గ్లోబల్ సమ్మిట్
డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు భారత్ ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్ల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సమ్మిట్ వేదిక, ప్రదర్శనశాలలు, అంతర్జాతీయ ప్రతినిధుల ఆహ్వానాలు, వివిధ కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు. సదస్సుకు వచ్చే ప్రతి ప్రతినిధికి ప్రత్యేక లైజనింగ్ అధికారిని నియమించాలని సీఎం సూచించారు. కార్యక్రమాల వివరాలను ముందుగానే వారికి అందించి, వసతి, ప్రయాణం, ఇతర ఏర్పాట్లలో ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానించాలని, ప్రతి విభాగానికి ప్రత్యేక అధికారులతో పాటు భద్రతా సిబ్బందిని నియమించాలని సూచించారు. పెట్టుబడులు పెట్టేందుకు, పరిశ్రమలు స్థాపించేందుకు ఆసక్తి చూపే సంస్థలకు ప్రత్యేక ఆహ్వానాలు పంపించాలని తెలిపారు. నవంబర్ 15 నాటికి సమ్మిట్ ఏర్పాట్లకు సంబంధించిన పూర్తి ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
ఈసారి ఆరు ఎగ్జిబిషన్ హాళ్లు
గత ఏడాది తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌తో పోలిస్తే ఈసారి మరింత విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. గతంలో ఒక ఎక్స్పో హాల్ మాత్రమే ఉండగా, ఈసారి ఆరు ప్రత్యేక ప్రదర్శనశాలలను ఏర్పాటు చేయనున్నారు. పెట్టుబడులు, పారిశ్రామిక రంగం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. ఇందులో భాగంగా రక్షా ఎక్స్పో, ఇండియా జాయ్-2026, స్టార్టప్ పెవిలియన్, ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్ ఎక్స్పో, వ్యవసాయ అనుబంధ రంగాల ప్రదర్శన, తెలంగాణ పెవిలియన్, ఎడ్యుకేషన్ ఎక్స్పో, క్లైమేట్ కాంక్లేవ్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.
రక్షణ రంగ సాంకేతికతకు ప్రత్యేక ప్రదర్శన
రక్షా ఎక్స్‌పోలో రక్షణ, ఏరోస్పేస్, అంతరిక్ష పరిశోధనలు, సైబర్ సెక్యూరిటీ రంగాలకు చెందిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించనున్నారు. డ్రోన్లు, రోబోటిక్స్, ఇతర అధునాతన పరికరాలను సందర్శకులకు పరిచయం చేయనున్నారు. వైమానిక విన్యాసాలు నిర్వహించేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఎక్స్‌పోలో పాల్గొనేందుకు ఇప్పటికే 49 సంస్థలు ఆసక్తి చూపినట్లు అధికారులు తెలిపారు. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ రంగాల అభివృద్ధిని ప్రోత్సహించే ఉద్దేశంతో ఇండియా జాయ్-2026కు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
136 స్టార్టప్‌ల ఆవిష్కరణల ప్రదర్శన
స్టార్టప్ రంగానికి ప్రోత్సాహం అందించేందుకు ప్రత్యేక పెవిలియన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 136 స్టార్టప్ సంస్థలు తమ ఆవిష్కరణలను ప్రదర్శించనున్నాయి. తెలంగాణ ఇన్నోవేషన్ స్టార్టప్ ఛాలెంజ్ ద్వారా వ్యవసాయం, విద్య, వైద్యం, ప్రభుత్వ భూముల పరిరక్షణ, ప్రజా మౌలిక సదుపాయాల సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను అందించాలని ఆవిష్కర్తలను ఆహ్వానిస్తున్నారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలకు సంబంధించి 60 కంపెనీలు తమ ఉత్పత్తులు, సాంకేతికతలను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యవసాయ ప్రదర్శనలో ఆధునిక సాగు విధానాలు, వ్యవసాయ డ్రోన్లు, పాడి పరిశ్రమ, మత్స్య రంగం, ఫుడ్ ప్రాసెసింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
తెలంగాణ సంస్కృతి, విద్యకు ప్రత్యేక ప్రాధాన్యం
రాష్ట్ర చరిత్ర, సంప్రదాయాలు, సంస్కృతి, చేనేత కళలు, బతుకమ్మ విశిష్టత, కాకతీయుల శిల్పకళను ప్రతిబింబించేలా తెలంగాణ పెవిలియన్‌ను రూపొందిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి ప్రయాణంతో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను కూడా ఇందులో ప్రదర్శించనున్నారు. పర్యాటక రంగానికి సమ్మిట్‌లో అధిక ప్రాధాన్యం కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రత్యేక ఎడ్యుకేషన్ ఎక్స్‌పోలో చర్చించాలని తెలిపారు. ‘నర్సరీ నుంచి ఆక్స్ఫర్డ్ వరకు’ అనే భావనతో రాష్ట్ర విద్యారంగంలోని వివిధ స్థాయిలను ప్రతిబింబించేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మూడు రోజుల పాటు నాలుగు ప్రధాన హాళ్లలో 52 రంగాలవారీ సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం 25 రంగాల ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. సమ్మిట్ ఏర్పాట్లను మంత్రివర్గ ఉపసంఘం ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎం సూచించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, గడ్డం వివేక్ వెంకటస్వామి సభ్యులుగా ఈ ఉపసంఘం పనిచేయనుంది.
డిసెంబర్ 8న వాతావరణ మార్పులపై ప్రత్యేక చర్చ
గ్లోబల్ సమ్మిట్‌లో ప్రత్యేక ఆకర్షణగా డిసెంబర్ 8న తెలంగాణ క్లైమేట్ కాంక్లేవ్ నిర్వహించనున్నారు. ఎల్‌నినో ప్రభావం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వర్షపాతంలో మార్పులు, కరువు పరిస్థితులు, నీటి కొరత వంటి అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది శాస్త్రవేత్తలు, రైతులు, వివిధ రంగాల నిపుణులు పాల్గొననున్నారు. ముఖ్యంగా ఐదు ప్రధాన అంశాలపై చర్చలు జరగనున్నాయి.
కరువును తట్టుకునే వ్యవసాయ విధానాలు.
*పశుసంరక్షణ, పశుసంపద అభివృద్ధి.
*తాగునీటి భద్రత, నీటి వనరుల నిర్వహణ.
*అధిక ఉష్ణోగ్రతల నుంచి ప్రజలు, పర్యావరణాన్ని రక్షించడం.
*అడవులు, జీవవైవిధ్య పరిరక్షణతో పాటు వ్యర్థాలను సంపదగా మార్చడం.
దీర్ఘకాలిక కార్యాచరణకు ప్రాధాన్యం..
వాతావరణ మార్పుల కారణంగా ఇప్పటికే రాష్ట్రంలో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి, వాటికి పరిష్కారాలను రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. కేవలం తాత్కాలిక చర్యలకే పరిమితం కాకుండా భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో పెట్టుకుని దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. వ్యవసాయం, తాగునీరు, పశుసంరక్షణ, అడవులు, జీవవైవిధ్య పరిరక్షణ వంటి రంగాల్లో వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించే విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరువు, వాతావరణ సంబంధిత సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించడంలో క్లైమేట్ కాంక్లేవ్ కీలకంగా ఉండాలని అధికారులకు సూచించారు.
ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

