Adulterated Milk Business
* పోచారంలో ఎస్ఓటీ పోలీసుల దాడి
* పాల వ్యాపారి అదుపులోకి..
* 35 పాలపొడి ప్యాకెట్లు సీజ్
ఆకేరు న్యూస్, డెస్క్ : రంగారెడ్డి జిల్లాలో కల్తీ పాల తయారీ కేంద్రం బయటపడింది. ఇబ్రహీంపట్నం మండలం పోచారంలో కొనసాగుతున్న కల్తీ పాల తయారీ కేంద్రంపై మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. రసాయనాలు, పాలపొడిని ఉపయోగించి కల్తీ పాలను తయారు చేస్తున్నట్లు గుర్తించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. పోచారంలో పాల వ్యాపారి అండే శ్రీశైలం (43) హైడ్రోజన్ పెరాక్సైడ్, ధోల్పూర్ పాలపొడిని కలిపి కల్తీ పాలను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ పాలను హైదరాబాద్‌లోని వినియోగదారులకు సరఫరా చేస్తున్నట్లు ప్రాథమికంగా వెల్లడైంది.
* 100 లీటర్ల కల్తీ పాలు స్వాధీనం
దాడుల సమయంలో పోలీసులు 100 లీటర్ల కల్తీ పాలు, ఒక లీటర్ హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఒక్కో కిలో బరువున్న 35 ధోల్పూర్ పాలపొడి ప్యాకెట్లను సీజ్ చేశారు. పాల వ్యాపారి శ్రీశైలంను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో కల్తీ పాల సరఫరాపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రజలకు సరఫరా చేసే పాల నాణ్యతపై తనిఖీలు నిర్వహించాల్సిన అవసరాన్ని ఈ ఘటన గుర్తు చేస్తోంది. పోలీసులు స్వాధీనం చేసుకున్న పదార్థాలపై తదుపరి విచారణ కొనసాగుతోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

