Bhandara Tiger Attack
* మహారాష్ట్రలో ఐదేళ్ల బాలుడిని బలిగొన్న పులి
ఆకేరు న్యూస్, భండారా (మహారాష్ట్ర) : మహారాష్ట్రలోని భండారా జిల్లాలో దీపావళి పండుగ రోజున అత్యంత హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రులతో కలిసి పొలానికి వెళ్లిన ఐదేళ్ల చిన్నారిపై పెద్దపులి దాడి చేసి ప్రాణం తీసింది. పండుగ వేళ ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపిన ఈ ఘటన, స్థానిక గ్రామస్తులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.
అటవీ శాఖ అధికారుల సమాచారం ప్రకారం.. భండారా జిల్లా లాఖందూర్ తాలూకాలోని డోనాడ్ గ్రామానికి చెందిన దంపతులు నవంబర్ 5 (బుధవారం) మధ్యాహ్నం తమ కుమారుడు మోక్ష సచిన్ బుర్డే (5) తో కలిసి పొలానికి వెళ్లారు. పొలంలో పనులు జరుగుతుండగా.. క్షణాల వ్యవధిలో సమీపంలోని పొదల్లో నుంచి వచ్చిన పెద్దపులి ఒక్కసారిగా చిన్నారి మోక్షపైకి దూకింది. బాలుడిని నోట కరుచుకుని సుమారు 200 మీటర్ల దూరం అటవీ ప్రాంతం వైపు ఈడ్చుకెళ్లింది.
* భయాందోళనలో గ్రామస్తులు..
బాలుడి కేకలు విని తల్లిదండ్రులు, స్థానికులు వెంటనే అప్రమత్తమై పెద్దపెట్టున కేకలు వేస్తూ పులి వెనుకే పరిగెత్తారు. కానీ అప్పటికే తీవ్ర గాయాలపాలైన బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. దీపావళి నాడు ఆనందంగా ఉండాల్సిన గ్రామంలో ఈ అపశృతి జరగడంతో డోనాడ్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పగటిపూటే పొలాల వద్ద పులులు సంచరిస్తుండటంతో రైతులు, వ్యవసాయ కూలీలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఆ ప్రాంతంలో సంచరిస్తున్న పులిని బంధించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా తగిన ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

