Dammannapet Ayah Job Controversy Selection Dispute
* జాయినింగ్ లెటర్ ఇచ్చి వెనక్కి
* ఆయా పోస్టుల ఎంపికలో ఏం జరిగింది
* దమ్మన్నపేటలో ఉద్యోగ ఎంపిక వివాదం
* రాజకీయ ఒత్తిళ్లతో అన్యాయం చేశారంటూ ఆవేదన
ఆకేరు న్యూస్, వరంగల్ : మదిగమ్మట గ్రామంలోని ప్రభుత్వ హైస్కూల్లో ప్రీ-ప్రైమరీ సెక్షన్‌కు సంబంధించిన ఆయా పోస్టు ఎంపిక వివాదాస్పదంగా మారింది. నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకొని, మెరిట్ జాబితాలో తనకు చోటు లభించినప్పటికీ చివరికి ఉద్యోగ అవకాశం కల్పించలేదని ఓ బాధితురాలు ఆరోపిస్తున్నారు. తనకు ఎంపికైనట్లు ఎంఈవో కార్యాలయం నుంచి సమాచారం ఇచ్చి, జాయినింగ్ లెటర్ కూడా అందించారని, ఆ తర్వాత రాజకీయ ఒత్తిళ్లతో ఎంపిక ప్రక్రియలో మార్పులు చేశారని ఆమె వాపోతున్నారు.
* మెమో కోసం పది రోజుల పాటు ప్రయత్నం
బాధితురాలి కథనం ప్రకారం.. ప్రీ-ప్రైమరీ సెక్షన్లో ఆయా పోస్టు భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తు చేసుకోవాలంటే ఏడో తరగతి మెమో తప్పనిసరిగా సమర్పించాలని నిబంధన విధించారు. అయితే తన వద్ద మెమో లేకపోవడంతో మొదట దరఖాస్తు స్వీకరించలేదని ఆమె తెలిపారు. దీంతో తాను ఏడో తరగతి చదివిన పాఠశాలకు సుమారు పది రోజుల పాటు తిరిగి, ప్రధానోపాధ్యాయుడిని కలిసి మెమో తెచ్చుకున్నానని వివరించారు. మెమో తీసుకొచ్చే సమయానికి దరఖాస్తు చేసుకునేందుకు చివరి రోజని అధికారులు చెప్పినట్లు బాధితురాలు పేర్కొన్నారు. సాయంత్రం వరకు ప్రయత్నించి, కార్యాలయాలన్నీ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లాయని తెలిసి అక్కడికి వెళ్లి ఏడో తరగతి మెమోతో దరఖాస్తు సమర్పించినట్లు తెలిపారు.
* సెలెక్ట్ అయ్యారని చెప్పి.. ఆర్డర్ కాపీ ఇవ్వలేదని ఆరోపణ
దరఖాస్తుల పరిశీలన అనంతరం ఎంఈవో కార్యాలయం నుంచి తనను పిలిచి ఎంపికైనట్లు తెలిపారని బాధితురాలు చెబుతున్నారు. మరుసటి రోజు ఆర్డర్ కాపీ ఇస్తామని చెప్పినా ఇవ్వలేదని ఆరోపించారు. అనంతరం మెరిట్ జాబితాను ప్రదర్శించి, అభ్యంతరాలు ఉన్నవారు అధికారులను సంప్రదించాలని సూచించినట్లు తెలిపారు.
* రాజకీయ ఒత్తిళ్లతో మళ్లీ ఇంటర్వ్యూలా
తనకు మెరిట్‌తో పాటు స్థానిక వార్డు ప్రాధాన్యత కూడా ఉందని బాధితురాలు పేర్కొన్నారు. అయితే కలెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చాయని చెబుతూ ఎంపిక ప్రక్రియలో మార్పులు చేసి మళ్లీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని అధికారులు చెప్పినట్లు ఆమె ఆరోపించారు. తనకు రావాల్సిన ఆర్డర్ కాపీని వేరే వ్యక్తులకు ఇచ్చి పాఠశాలకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హతలు, మెరిట్ ఉన్నప్పటికీ తమకు అన్యాయం జరిగిందని బాధితురాలు వాపోతున్నారు. ఎంపిక ప్రక్రియలో జరిగిన పరిణామాలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని, తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ ఆరోపణలపై సంబంధిత అధికారుల వివరణ తెలియాల్సి ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

