గఫార్ మార్కెట్
* నాలుగు అంతస్తుల భవనానికి వ్యాపించిన మంటలు..
* 22 ఫైర్ ఇంజిన్లతో సహాయక చర్యలు
ఆకేరు న్యూస్, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ప్రముఖ గఫార్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కరోల్ బాగ్ ప్రాంతంలోని మార్కెట్లో శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగి నాలుగు అంతస్తుల వాణిజ్య భవనానికి వ్యాపించాయి. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక శాఖ 22 ఫైర్ ఇంజిన్లను రంగంలోకి దించింది.
మొబైల్ బ్యాటరీల దుకాణంలో మంటలు
మార్కెట్లోని చైన్ వాలీ గలీలో ఉన్న పూరీ ప్లాజా భవనంలోని మొబైల్ యాక్సెసరీస్ దుకాణంలో ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 1.28 గంటల సమయంలో అగ్నిప్రమాదంపై సమాచారం అందడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. భవనంలోని 13/21 నంబర్ దుకాణంలో మంటలు చెలరేగినట్లు గుర్తించారు.
పై అంతస్తులకు వ్యాపించిన మంటలు
ప్రాథమిక సమాచారం ప్రకారం.. గ్రౌండ్ ఫ్లోర్లో నిల్వ ఉంచిన మొబైల్ ఫోన్ బ్యాటరీల వద్ద మొదట మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు. క్రమంగా అవి పై అంతస్తులకు వ్యాపించాయి. దీంతో భవనంలోని దుకాణాలు, సరుకులకు భారీగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. సహాయక చర్యల్లో భాగంగా ఫైర్ ఇంజిన్లతో పాటు వాటర్ బౌజర్లు, లైటింగ్ పరికరాలను కూడా వినియోగించారు. మూడు క్యాట్స్ అంబులెన్స్‌లు, రెండు పోలీసు వాహనాలను ఘటనా స్థలంలో సిద్ధంగా ఉంచారు.
ప్రాణనష్టం లేదు
గంటల తరబడి శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదని అధికారులు వెల్లడించారు. అయితే భవనంలోని దుకాణాలు, వస్తువులకు భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బ్యాటరీల వేడెక్కడం వల్లేనా?
అగ్నిప్రమాదానికి కచ్చితమైన కారణం ఇంకా వెల్లడికాలేదు. మొబైల్ బ్యాటరీలు అధికంగా వేడెక్కడం లేదా ఓవర్‌చార్జింగ్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. దీనిపై అగ్నిమాపక శాఖ, ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ విచారణ చేపట్టనున్నారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) బృందం కూడా భవనాన్ని పరిశీలించనుంది.
భవనం భద్రతపై ఆరా
అగ్నిప్రమాదానికి గురైన భవనం నిర్మాణ పటిష్టతపై ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) అధికారులు పరిశీలన చేపట్టనున్నారు. భవనం మరమ్మతులకు అనుకూలంగా ఉందా? లేదా కూలిపోయే ప్రమాదం ఉందా? అనే అంశాలను అంచనా వేయనున్నారు. మరోవైపు పోలీసులు ఘటనా స్థలంలో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. పండుగల వేళ రద్దీగా ఉండే వాణిజ్య మార్కెట్లలో అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లపై ఈ ఘటన మరోసారి చర్చకు దారితీసింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

