జయేశ్ రంజన్
* అధికారులకు జయేశ్ రంజన్ ఆదేశాలు
Jayesh Ranjan| ఆకేరు న్యూస్, ములుగు: అటవీ సంపదను సంరక్షిస్తూ వన్యప్రాణుల రక్షణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ అధికారులను ఆదేశించారు. వన్యప్రాణుల వేట, అటవీ అగ్ని ప్రమాదాల నివారణకు జిల్లా యంత్రాంగం, పోలీసు, అటవీ శాఖలు సమన్వయంతో సంయుక్త కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
అటవీ ప్రాంతాల్లో పర్యటన
శుక్రవారం ములుగు జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, జిల్లా అటవీ అధికారి వికాస్ మీనాలతో కలిసి తాడ్వాయి అటవీ ప్రాంతం, ఏటూరునాగారం అభయారణ్యం, జలగలంచ దుర్గం గుట్ట, కొండాయి ఫారెస్ట్ వాచ్ టవర్, గుత్తికోయల ఆవాస ప్రాంతాలను సందర్శించారు. అటవీ సంపద, జీవవైవిధ్యం, సంరక్షణ చర్యలు, పర్యాటక అభివృద్ధికి ఉన్న అవకాశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
వేటగాళ్లపై కఠిన చర్యలు
వన్యప్రాణులను వేటాడటం అమానవీయమని, ఇలాంటి చట్టవిరుద్ధ చర్యలను తీవ్రంగా పరిగణించాలని జయేశ్ రంజన్ అన్నారు. ఇటీవల అడవి దున్నను వేటాడిన ఘటనపై ఆరా తీశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి, వేట వెనుక ఉన్న కారణాలను పరిశీలించి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ముందస్తు చర్యలే ముఖ్యం
అటవీ అగ్ని ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించడం కంటే, అసలు ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టడం ముఖ్యమని పేర్కొన్నారు. వన్యప్రాణుల వేట, అగ్ని ప్రమాదాల నివారణకు కలెక్టర్, ఎస్పీ, డీఎఫ్ఓ, అటవీ అధికారులు కలిసి సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.
గుత్తికోయలకు ప్రత్యామ్నాయ ఉపాధి
గుత్తికోయల గూడెంను సందర్శించిన ఆయన వారి జీవన పరిస్థితులు, ఉపాధి అవకాశాలను పరిశీలించారు. అడవులను నరికివేయకుండా జీవనోపాధి పొందేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను కల్పించే అంశంపై అధికారులతో చర్చించారు. అటవీ నరికివేత చట్టవిరుద్ధమని, అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వివరించారు.
ఎల్నినో ప్రభావాలపై ప్రత్యేక దృష్టి
ఎల్నినో ప్రభావాలను ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలు అవసరమని జయేశ్ రంజన్ అన్నారు. వచ్చే నెల హైదరాబాద్లో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్లో ఈ అంశంపై ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయం, తాగునీరు, సాగునీరు, అటవీ జీవవైవిధ్యం, అధిక ఉష్ణోగ్రతల్లో పనిచేసే కార్మికులు, గిగ్ వర్కర్లపై ఎల్నినో ప్రభావాలను చర్చించనున్నట్లు వెల్లడించారు.
నిపుణుల సూచనలు, ఇతర ప్రాంతాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలను పరిశీలించి తక్షణ, ఏడాది, ఐదేళ్ల కాలానికి అవసరమైన కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. పర్యటనలో పరిశీలించిన అంశాలను రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క దృష్టికి తీసుకెళ్లి, ఆమె సూచనలతో జిల్లా అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందిస్తామని పేర్కొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

