మంత్రి సీతక్క
* ఇప్ప పువ్వు టీకి సీతక్క బ్రాండ్ అంబాసిడర్
* అడవి సంపదతో మహిళలకు ఉపాధి
Seethakka| ఆకేరు న్యూస్, ములుగు: అల్లం చాయ్, మసాలా చాయ్, గ్రీన్ టీ, లెమన్ టీ.. ఇలా రకరకాల టీలకు తోడుగా ఇప్పుడు ఇప్ప పువ్వు టీ అందుబాటులోకి వచ్చింది. అటవీ సంపదతో మహిళలకు ఉపాధి, ఆదాయం కల్పించాలనే లక్ష్యంతో మంత్రి సీతక్క ఈ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు.
ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామం వద్ద మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇప్ప పువ్వు టీ స్టాల్ను మంత్రి సీతక్క ప్రారంభించారు. ఇప్ప పువ్వుతో తయారవుతున్న లడ్డూలకు ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు లభించగా, ఇప్పుడు టీకి కూడా విస్తృత ప్రచారం కల్పించాలని ఆమె నిర్ణయించారు. ఇందులో భాగంగా స్వయంగా బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తానని ప్రకటించారు.
అటవీ ఉత్పత్తులకు అదనపు విలువ
అడవుల్లో సహజంగా లభించే ఇప్ప పువ్వు ఆదివాసీ గిరిజనుల జీవన విధానంలో భాగమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. తరతరాలుగా గిరిజనులు ఇప్ప పువ్వును వివిధ అవసరాలకు వినియోగిస్తున్నారని తెలిపారు. అటవీ ఉత్పత్తులను సేకరించి విక్రయించడమే కాకుండా, వాటితో వినూత్న ఉత్పత్తులు తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తే మహిళలకు మెరుగైన ఆదాయం లభిస్తుందని చెప్పారు.
మహిళా వ్యాపారవేత్తలకు ప్రోత్సాహం
స్వయం సహాయక సంఘాల మహిళలు స్థానికంగా లభించే వనరులతో కొత్త ఉత్పత్తులను తయారు చేసి వ్యాపారవేత్తలుగా ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు. ఇప్ప పువ్వు టీకి ప్రజల్లో ఆదరణ పెరిగేలా తాను ప్రచారం చేస్తానని, మహిళా సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని భరోసా ఇచ్చారు.
పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా..
ములుగు జిల్లాకు వచ్చే పర్యాటకులకు ఇప్ప పువ్వు టీని ప్రత్యేక ఆకర్షణగా పరిచయం చేయాలని మంత్రి సూచించారు. ఈ ఉత్పత్తిని మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు తెలిపారు. అటవీ సంపదకు అదనపు విలువ జోడించి ఆదివాసీ మహిళల చేతుల్లో ఆర్థిక సంపదగా మార్చడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మండల స్థాయి వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

