Telangana Government Employees demand PRC implementation
* మూడేళ్లయినా నివేదిక ఏదీ
* దీపావళి తర్వాత కీలక కార్యాచరణ
* ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల డిమాండ్
ఆకేరు న్యూస్, డెస్క్ : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలుపై ఉద్యోగ సంఘాల జేఏసీ మరోసారి గళమెత్తింది. ఉద్యోగులకు ఫిట్మెంట్ ఇవ్వాల్సిందేనని, దీపావళిలోగా ప్రభుత్వం పీఆర్సీ కమిషన్ నివేదికను తెప్పించుకోవాలని డిమాండ్ చేసింది. పీఆర్సీ నివేదిక సమర్పణలో జరుగుతున్న జాప్యంపై ఉద్యోగ సంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
* రెండు నెలలైనా నివేదిక రాలేదు
పీఆర్సీ నివేదికను త్వరగా సమర్పించాలని ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించి రెండు నెలలు గడుస్తున్నా కమిషన్ నుంచి నివేదిక రాలేదని జేఏసీ నేతలు పేర్కొన్నారు. పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి ఇప్పటికే మూడేళ్లు గడిచిపోయిందని, కమిషన్ కాలపరిమితి కూడా ముగిసిందని గుర్తుచేశారు. అయినప్పటికీ నివేదిక సమర్పణలో జాప్యం ఎందుకు జరుగుతోందో అర్థం కావడం లేదని ప్రశ్నించారు.
* ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు
కమిషన్ తీరుతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని నేతలు మారం, ఏలూరి ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్సీ అమలుపై స్పష్టత లేకపోవడంతో ఉద్యోగులు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నివేదికను తెప్పించుకోవాలని కోరారు. ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల చెల్లింపుల విషయంలోనూ ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని జేఏసీ నేతలు పేర్కొన్నారు. పీఆర్సీతో పాటు పెండింగ్ బిల్లుల సమస్యలను కూడా పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
* దీపావళి తర్వాత మరోసారి భేటీ
ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం దీపావళి తర్వాత మరోసారి సమావేశం కావాలని జేఏసీ నేతలు నిర్ణయించారు. తదుపరి కార్యాచరణపై చర్చించి ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం పీఆర్సీ నివేదికను త్వరగా తెప్పించుకొని ఉద్యోగులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.

