Shivalayam Teaser
* ‘రంగస్థలం’ ఫేమ్ ఆచంట మహేష్ ప్రధాన పాత్ర
* వెంకట్రెడ్డి నంది దర్శకత్వంలో ఆధ్యాత్మిక చిత్రం
ఆకేరు న్యూస్, సినిమా: తెలుగు ప్రేక్షకులను భక్తి, ఆధ్యాత్మికతతో అలరించేందుకు ‘శివాలయం’ చిత్రం సిద్ధమవుతోంది. ఈ సినిమా టీజర్, పోస్టర్ను హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో చిత్రబృందం ఘనంగా ఆవిష్కరించింది. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శివాలయం సెట్ వేడుకకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
ఆచంట మహేష్ ప్రధాన పాత్రలో..
శ్రీ శివసాయి ఫిలిమ్స్, శ్రీమతి శ్రీలక్ష్మినర్సింహారెడ్డి చిత్రాలయం సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ‘రంగస్థలం’ ఫేమ్ ఆచంట మహేష్, కాంచన దీప్తిరెడ్డి, ధన్రాజ్, సుష్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వెంకట్రెడ్డి నంది దర్శకత్వం వహిస్తుండగా, ఆయనతో పాటు కళ్లెం నర్సింహారెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
దర్శకుడిపై ప్రశంసలు..
టీజర్, పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి నిర్మాతలు ఈద రవి రాజా, సాయిలక్ష్మణ్ అల్లు, నబీ షేక్, పి. నాగలక్ష్మి, కుప్పిలి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నటుడు ఘర్షణ శ్రీనివాస్ మాట్లాడుతూ.. సినిమా నిర్మాణం, విడుదల సవాలుగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లోనూ దర్శకుడు వెంకట్రెడ్డి వరుసగా సినిమాలు తెరకెక్కించడం అభినందనీయమని అన్నారు. ‘శివాలయం’ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు.
సీనియర్ నటుడు నాగ మహేష్ తనకు మంచి పాత్రతో పాటు పాటలో నటించే అవకాశం కల్పించిన దర్శకుడికి కృతజ్ఞతలు తెలిపారు. సంగీత దర్శకుడు డ్రమ్స్ రాము మాట్లాడుతూ.. ఈ చిత్రంలో మూడు పాటలు ఉన్నాయని వెల్లడించారు.
ప్రేక్షకుల ఆదరణపై ఆశాభావం..
హీరో ఆచంట మహేష్ మాట్లాడుతూ.. అతి తక్కువ సమయంలోనే సినిమా చిత్రీకరణ పూర్తి చేయడం సంతోషంగా ఉందన్నారు. నిర్మాత కళ్లెం నర్సింహారెడ్డి వ్యవసాయ రంగంలో అనుభవం కలిగిన వ్యక్తి అని, గతంలో నందమూరి తారక రామారావుతో కలిసి పనిచేసిన అనుభవం ఉండటం విశేషమని పేర్కొన్నారు. ఆయన నిర్మాణంలో నటించడం గర్వంగా ఉందన్నారు.
హీరోయిన్ దీప్తిరెడ్డి తనకు అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. మరో హీరోయిన్ సుష్మ మాట్లాడుతూ.. సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయని, తమ చిత్రానికి ప్రేక్షకులు ఆదరణ అందించాలని కోరారు.
భక్తి, ఆధ్యాత్మికతతో పాటు భావోద్వేగాలకు ప్రాధాన్యతనిస్తూ రూపొందుతున్న ‘శివాలయం’ టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

