నీలమ్మ ఫైల్ ఫోటో
*ఆద్యకళ వస్తు సంపద సంరక్షణకు అంకితమైన జీవితం
*అనారోగ్యంతో నిమ్స్‌లో చికిత్స పొందుతూ కన్నుమూత
*రెండు కళ్లను ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి దానం
* పలువురి సంతాపం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ప్రముఖ పరిశోధకుడు, ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు సతీమణి నీలమ్మ (70) హైదరాబాద్‌లో కన్నుమూశారు. గుండె, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి 10.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆద్యకళ వస్తు సంపద సేకరణ, సంరక్షణలో భర్తకు చేదోడువాదోడుగా నిలిచిన ఆమె మృతిపట్ల పలువురు కవులు, రచయితలు, కళాకారులు, పరిశోధకులు సంతాపం వ్యక్తం చేశారు.
* ఆద్యకళ సంరక్షణలో కీలక పాత్ర..
జయధీర్ తిరుమలరావు సేకరించిన అరుదైన చారిత్రక, సాంస్కృతిక వస్తువులను భద్రపరచడంలో నీలమ్మ కీలక పాత్ర పోషించారు. తాళపత్ర గ్రంథాలు, కాగితపు చుట్టలు, ఆదివాసీ, గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే సంగీత వాద్యాలు, మట్టి పాత్రలు, లోహపు వస్తువులు, కుల పురాణాలను తెలిపే పటాలు వంటి అపురూప సంపదను దశాబ్దాలపాటు కాపాడారు. ఆద్యకళతో అనుబంధమున్నవారు ఆమెను ఆప్యాయంగా ‘ఆద్యకళ అమ్మ’గా పిలుచుకునేవారు.
వస్తు సేకరణ కోసం క్షేత్ర పర్యటనల్లో పాల్గొనడంతోపాటు, సేకరించి తెచ్చిన వస్తువులపై దుమ్ము ధూళిని శుభ్రపరచడం, వాటిని జాగ్రత్తగా భద్రపరచడంలో ఆమె చేసిన కృషిని జయధీర్ తిరుమలరావు గుర్తుచేసుకున్నారు. ఆమె మరణంతో ఆద్యకళ ఆరు మ్యూజియంలు కళ తప్పాయని తన సామాజిక మాధ్యమ పోస్టులో ఆవేదన వ్యక్తం చేశారు.
* సాహితీవేత్తలు, కళాకారులకు ఆత్మీయురాలు..
ఇంటికి వచ్చే సాహితీవేత్తలు, కళాకారులతో నీలమ్మ ఆత్మీయంగా మెలిగేవారు. వారికి అవసరమైనవి సమకూర్చడంలో ఎప్పుడూ ముందుండేవారని జయధీర్ పేర్కొన్నారు. ప్రజా సాంస్కృతిక సంపదను పరిరక్షించడంలో ఆమె అందించిన సహకారాన్ని పలువురు రచయితలు, పరిశోధకులు స్మరించుకున్నారు. జయధీర్ తిరుమలరావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
* ఆమె సంకల్పం మేరకు నేత్ర, దేహదానం..
నీలమ్మ రెండు కళ్లను ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి దానం చేసినట్లు జయధీర్ తిరుమలరావు తెలిపారు. ఆమె కోరిక మేరకు పార్థివదేహాన్ని మంగళవారం గాంధీ ఆస్పత్రికి అప్పగించనున్నట్లు వెల్లడించారు. చివరి చూపు కోసం మంగళవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు డీడీ కాలనీలో పార్థివదేహాన్ని ఉంచనున్నట్లు తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

