Telangana Census 2027
* జనవరి 25 నుంచి ప్రారంభం
* జనవరి 10 నుంచి స్వీయ గణన
* ఫిబ్రవరి 28తో ముగియనున్న లెక్కింపు
ఆకేరు న్యూస్, డెస్క్: తెలంగాణలో జనగణన-2027 నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు చేసింది. వచ్చే ఏడాది జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఇళ్ల వారీగా జనాభా లెక్కింపు చేపట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనగణనకు ముందు ప్రజలకు స్వీయ గణన చేసుకునే అవకాశం కల్పించింది. జనవరి 10 నుంచి 24 వరకు స్వీయ గణనకు అవకాశం కల్పించారు. ఈ సమయంలో ప్రజలు ఆన్లైన్ విధానంలో తమ కుటుంబానికి సంబంధించిన వివరాలను స్వయంగా నమోదు చేసుకోవచ్చు. అనంతరం జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు గణన సిబ్బంది ఇంటింటికీ వెళ్లి జనాభా వివరాలను సేకరిస్తారు.
మార్చి 1 నుంచి సవరణ ప్రక్రియ
ఫిబ్రవరి 28తో ప్రధాన జనాభా గణన ప్రక్రియ ముగియనుంది. అనంతరం మార్చి 1 నుంచి 5 వరకు రివిజనల్ రౌండ్ నిర్వహించనున్నారు. జనాభా లెక్కింపునకు 2027 మార్చి 1 అర్ధరాత్రి 12 గంటలను ప్రామాణిక తేదీగా నిర్ణయించారు. 2027 జనగణన దేశంలో తొలిసారిగా పూర్తిస్థాయి డిజిటల్ విధానంలో నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ప్రజలకు స్వీయ గణన సదుపాయం కల్పించడంతో పాటు, క్షేత్రస్థాయిలో సిబ్బంది మొబైల్ అప్లికేషన్ ద్వారా వివరాలను నమోదు చేయనున్నారు. జనగణన ద్వారా దేశ జనాభా, కుటుంబాలు, సామాజిక, ఆర్థిక, విద్యా తదితర అంశాలకు సంబంధించిన వివరాలను సేకరించనున్నారు. ఈ వివరాలు భవిష్యత్తులో ప్రభుత్వ పథకాల రూపకల్పన, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ఉపయోగపడనున్నాయి.
ముఖ్యమైన తేదీలు ఇవే..
స్వీయ గణన: జనవరి 10 నుంచి 24, 2027 వరకు.
ఇంటింటి జనాభా లెక్కింపు: జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28, 2027 వరకు.
సవరణ ప్రక్రియ: మార్చి 1 నుంచి 5, 2027 వరకు.
జనాభా గణన ప్రామాణిక తేదీ: మార్చి 1, 2027.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

