తోడుసు బిక్షపతి
* పార్టీకి బిక్షపతి రాజీనామా
* 20 ఏళ్ల రాజకీయ ప్రయాణానికి ముగింపు
ఆకేరు న్యూస్, పాలకుర్తి: పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని గూడూరు గ్రామ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు, గూడూరు గ్రామ మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు తోడుసు బిక్షపతి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సుమారు రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ఆయన, తన రాజకీయ ప్రయాణానికి ప్రస్తుతానికి ముగింపు పలుకుతున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా బిక్షపతి మాట్లాడుతూ.. గత 20 ఏళ్లుగా గూడూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేశానని తెలిపారు. పార్టీ అధికారంలో లేని సమయంలో గ్రామ అధ్యక్షుడిగా, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించానని గుర్తుచేశారు. వార్డు సభ్యుడిగా పోటీ చేసి ప్రజల మధ్య ఉంటూ పార్టీ కోసం పనిచేశానని పేర్కొన్నారు. తన సొంత సంపాదనలో కొంత భాగాన్ని కూడా పార్టీ కార్యక్రమాల కోసం ఖర్చు చేసినట్లు తెలిపారు.
అయితే, ఇన్నేళ్లుగా పార్టీ కోసం కష్టపడినప్పటికీ తగిన గుర్తింపు, గౌరవం లభించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాల విషయంలోనూ తనకు న్యాయం జరగలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామ కాంగ్రెస్లో కొందరి స్వార్థ రాజకీయాల కారణంగా నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదని ఆరోపించారు.
ఈ సమస్యలను మండల అధ్యక్షుడితో పాటు జాన్సీ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా స్పందన రాలేదని బిక్షపతి పేర్కొన్నారు. పదవులపై తనకు ఎప్పుడూ ఆశ లేదని, పార్టీ కోసం చేసిన సేవకు కనీస గుర్తింపు, గౌరవం మాత్రమే కోరుకున్నానని తెలిపారు.
ఈ నేపథ్యంలో తీవ్ర మనోవేదనతో కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. త్వరలోనే తన అనుచరులు, శ్రేయోభిలాషులతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని వెల్లడించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

