Bhatti Vikramarka
* మైరా క్లినిక్ ప్రారంభోత్సవం
* పబ్లిక్ స్కూల్ భవనాలకు శంకుస్థాపన
ఆకేరు న్యూస్, హనుమకొండ: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్ శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క రేపు (నవంబర్ 11, బుధవారం) హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు నూతన భవన నిర్మాణాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఆయన పర్యటనకు సంబంధించిన మినిట్ టు మినిట్ షెడ్యూల్‌ను డిప్యూటీ సీఎం ప్రైవేట్ కార్యదర్శి టి. భాస్కర శర్మ విడుదల చేశారు.
పర్యటన షెడ్యూల్ ఇదే..
ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట ప్రజాభవన్ నుంచి భట్టి విక్రమార్క రోడ్డు మార్గంలో హనుమకొండకు బయలుదేరుతారు. ఉదయం 11 గంటలకు నక్కలగుట్టకు చేరుకుని స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులతో సమావేశమవుతారు.
ఉదయం 11.10 నుంచి 11.40 గంటల వరకు నక్కలగుట్టలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘మైరా క్లినిక్’ను ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.30 గంటల వరకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ నూతన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు.
మధ్యాహ్నం 12.45 నుంచి 1.30 గంటల వరకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నివాసంలో నిర్వహించే ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు హనుమకొండ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు బయలుదేరుతారు. సాయంత్రం 3.30 గంటలకు ప్రజాభవన్‌కు చేరుకుంటారు.
పటిష్ట భద్రతా ఏర్పాట్లు
ఉప ముఖ్యమంత్రికి ఉన్న జెడ్ కేటగిరీ భద్రత నేపథ్యంలో పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భద్రత, ఎస్కార్ట్, రవాణా, వసతి, ప్రొటోకాల్ ఏర్పాట్లను పర్యవేక్షించాలని హైదరాబాద్, వరంగల్ పోలీస్ కమిషనర్లు, యాదాద్రి భువనగిరి, జనగామ ఎస్పీలతో పాటు హైదరాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లకు సూచించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

