ఎంపీ దిష్టిబొమ్మ దహనం
* జనార్దన్ మిశ్రా బేషరతుగా క్షమాపణ చెప్పాలి
Farmers Protest| ఆకేరు న్యూస్, వరంగల్: దేశానికి అన్నం పెట్టే రైతాంగాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా బేషరతుగా క్షమాపణ చెప్పాలని వివిధ రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. రైతుల శ్రమను అవహేళన చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాశిబుగ్గ జంక్షన్లో రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీ దిష్టిబొమ్మను దహనం చేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఇటీవల ఓ కార్యక్రమంలో ఎంపీ జనార్దన్ మిశ్రా మాట్లాడుతూ.. రైతులు సంవత్సరంలో కేవలం మూడు నెలలు మాత్రమే పనిచేస్తారని, మిగిలిన తొమ్మిది నెలలు పేకాట ఆడుతూ, గుట్కాలు తింటూ, మద్యం సేవిస్తూ కాలక్షేపం చేస్తారని వ్యాఖ్యానించినట్లు రైతు సంఘాల నాయకులు తెలిపారు. ఈ వ్యాఖ్యలు దేశ రైతాంగాన్ని అవమానించేలా ఉన్నాయని మండిపడ్డారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎండనకా, వాననకా ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటూ పంటలు పండించే రైతుల శ్రమను గుర్తించకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. వ్యవసాయంపై ఆధారపడి దేశ ప్రజల ఆకలి తీర్చే అన్నదాతల పట్ల గౌరవం చూపాలని సూచించారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలపైనా రైతు సంఘాల నాయకులు విమర్శలు గుప్పించారు. గత 12 ఏళ్లలో వ్యవసాయ పెట్టుబడి వ్యయం గణనీయంగా పెరిగిందని, కనీస మద్దతు ధర (MSP) హామీ అమలుపై రైతులకు స్పష్టత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు సుదీర్ఘ ఉద్యమం నిర్వహించారని గుర్తుచేశారు. ఆ ఉద్యమంలో 756 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు.
ఇప్పటికైనా బీజేపీ నాయకులు రైతులను కించపరిచే వ్యాఖ్యలు మానుకోవాలని, ఎంపీ జనార్దన్ మిశ్రా దేశ రైతాంగానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా రైతుల నుంచి తీవ్ర నిరసన ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం (AIKMS) ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాచర్ల బాలరాజు, తెలంగాణ రైతు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సోమిడి శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్క మొగిలయ్య, ఏఐకేఎంఎస్ఎంఎస్ జిల్లా అధ్యక్షుడు సుదమల్ల భాస్కర్, ఏఐకేఎస్ఎస్ఎస్ జిల్లా కన్వీనర్ వల్లందాస్ కుమార్, బండి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

