రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
* మఫత్లాల్కు మంత్రి వార్నింగ్!
* 2 వేల జతల సాక్సులు, 3 వేల ట్రంకు పెట్టెలు పెండింగ్..
* గడువులోగా సరఫరా చేయాలని ఆదేశం
Adluri Lakshman Kumar | ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణలోని ప్రభుత్వ గురుకులాలు, వసతి గృహాలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన నిత్యావసర వస్తువులు, విద్యా సామగ్రి, విద్యార్థుల కిట్ల సరఫరాలో జాప్యం జరగడంపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మఫత్లాల్ సంస్థ సరఫరాలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, నిర్ణీత గడువులోగా వస్తువులను అందించాలని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గురుకుల విద్యాసంస్థలకు ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ (PMU) ద్వారా చేపడుతున్న సరఫరాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు, సరఫరా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. విద్యాసంస్థల నుంచి వచ్చిన ఇండెంట్లు, ఇప్పటివరకు పూర్తయిన సరఫరాలు, పెండింగ్లో ఉన్న వస్తువులు, వాటి నాణ్యత తదితర అంశాలపై మంత్రి వివరాలు తెలుసుకున్నారు.
మఫత్లాల్ సంస్థపై మంత్రి ఆగ్రహం
గురుకుల విద్యాసంస్థలకు అవసరమైన వస్తువుల సరఫరా కోసం ఆగస్టు నెలలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి, కాంట్రాక్టర్లకు ఆర్డర్లు ఇచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో సరుకులు అందకపోవడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మఫత్లాల్ సంస్థ సరఫరాలో వెనుకబడటాన్ని ప్రస్తావించారు. టెండర్ నిబంధనలు, నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం వస్తువులను తప్పనిసరిగా సరఫరా చేయాలని ఆదేశించారు. జాప్యం కొనసాగితే సంస్థపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
5 వేల వస్తువులు పెండింగ్
సమీక్షలో సుమారు 2 వేల జతల రెండో విడత తెల్ల సాక్సులు, 3 వేల ట్రంకు పెట్టెల సరఫరా ఇంకా పెండింగ్లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. విద్యార్థులకు అవసరమైన వస్తువులు అందించడంలో ఇంతటి జాప్యం ఎందుకు జరుగుతోందని మంత్రి ప్రశ్నించారు. పెండింగ్లో ఉన్న అన్ని వస్తువులను వెంటనే విద్యాసంస్థలకు చేరవేయాలని ఆదేశించారు.
అంతేకాకుండా ఏయే వస్తువులు ఎంత పరిమాణంలో పెండింగ్లో ఉన్నాయి? వాటిని ఎప్పటిలోగా సరఫరా చేస్తారు? ఏయే విద్యాసంస్థలకు ముందుగా పంపిణీ చేస్తారు? అనే వివరాలతో స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. కేవలం హామీలు ఇవ్వకుండా క్షేత్రస్థాయిలో సరుకులు చేరేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
విద్యార్థుల సంక్షేమమే ప్రాధాన్యం
ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, నిత్యావసర వస్తువులు, విద్యా సామగ్రి అందించడం ప్రభుత్వ బాధ్యత అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సంక్షేమం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదన్నారు. సరఫరాలో జాప్యం వల్ల విద్యార్థుల చదువులు, వసతి, రోజువారీ అవసరాలకు ఇబ్బందులు కలగకూడదని స్పష్టం చేశారు.
నాణ్యతలో రాజీ పడొద్దు
విద్యార్థులకు అందించే ప్రతి వస్తువు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. సరుకుల సరఫరాతో పాటు వాటి నాణ్యతను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. నాసిరకం వస్తువులు సరఫరా చేసినా, నిర్ణీత గడువులోగా అందించకపోయినా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తెలిపారు.
సరఫరా ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తూ, పెండింగ్లో ఉన్న వస్తువుల పంపిణీని త్వరగా పూర్తి చేయాలని అధికారులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

