మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి
* పాలసీ పెరాలసిస్ లేదు..
* పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ హామీ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. తెలంగాణలో విధానపరమైన గందరగోళం లేదని, పెట్టుబడులకు అవసరమైన భూములు, నీరు, అనుమతులు, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక విధానాలను రూపొందించిందని తెలిపారు. రాష్ట్రానికి పాలసీ పెరాలసిస్ లేదని, పెట్టుబడిదారులు (Telangana Investments) ఎలాంటి సందేహాలు లేకుండా ముందుకు రావచ్చని భరోసా ఇచ్చారు.
* PHFIకి శంకుస్థాపన..
హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (PHFI) ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సైన్సెస్ క్యాంపస్‌కు శనివారం ముఖ్యమంత్రి (CM Revanth Reddy) శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా క్యాంపస్ మాస్టర్ ప్లాన్‌ను ఆవిష్కరించి, నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. విద్య, వైద్యం, పరిశ్రమలు, సేవారంగాల్లో తెలంగాణను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.
* 2028 జూన్ 2 నాటికి పీహెచ్ఎఫ్ఐ పూర్తి చేయాలి
హైదరాబాద్‌లో ఏర్పాటు కానున్న పీహెచ్ఎఫ్ఐ సంస్థ నగరానికి వైద్య, ప్రజారోగ్య రంగాల్లో అంతర్జాతీయ గుర్తింపును తీసుకొస్తుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సంస్థ నిర్మాణ పనులను వేగవంతం చేసి 2028 జూన్ 2 నాటికి పూర్తి చేసి ప్రారంభించాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. సంస్థ అభివృద్ధికి అవసరమైన తోడ్పాటు అందించడంతో పాటు, తాను స్వయంగా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తానని ప్రకటించారు.
ఇప్పటికే సనత్‌నగర్‌లో టిమ్స్ ఆస్పత్రిని ప్రారంభించామని, మిగిలిన టిమ్స్ ఆస్పత్రులను కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. గోషామహల్లో ఉస్మానియా ఆస్పత్రిని కొత్తగా నిర్మిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం మొత్తం రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు.
* ఫార్మా రంగంలో హైదరాబాద్‌కు ప్రపంచ గుర్తింపు..
హైదరాబాద్ ఫార్మా రంగంలో అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికి గతంలో ఏర్పాటు చేసిన పరిశ్రమలు, పరిశోధనా సంస్థలు పునాదులుగా నిలిచాయని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. 1960వ దశకంలో నెహ్రూ, ఇందిరాగాంధీ చొరవతో హైదరాబాద్‌లో ఐడీపీఎల్ ఏర్పాటు కావడం ఫార్మా రంగ అభివృద్ధికి దోహదపడిందన్నారు. పరిశోధన, అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం వల్లే హైదరాబాద్ ప్రపంచ ఫార్మా రంగంలో ప్రత్యేక గుర్తింపు సాధించిందని చెప్పారు.
దేశంలోని బల్క్ డ్రగ్స్ ఉత్పత్తిలో సుమారు 40 శాతం హైదరాబాద్‌లోనే జరుగుతోందని పేర్కొన్నారు. ప్రముఖ అంతర్జాతీయ ఫార్మా సంస్థ ఎలీ లిల్లీ హైదరాబాద్‌లో ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొస్తోందని తెలిపారు. అనేక అంతర్జాతీయ సంస్థలు తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నాయని చెప్పారు.
* ఏటా రూ.2,500 కోట్లతో ఆరోగ్య సేవలు..
ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయనిధి పథకాల ద్వారా ప్రతి సంవత్సరం సుమారు రూ.2,500 కోట్లు ఖర్చు చేస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. క్యాన్సర్‌ను నోటిఫైడ్ వ్యాధిగా గుర్తించి రాష్ట్రవ్యాప్తంగా రోగుల వివరాలను సేకరిస్తున్నామని చెప్పారు. ఆరోగ్యశ్రీ ద్వారా అందుబాటులోకి వస్తున్న సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా ఏ ప్రాంతంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయో గుర్తించవచ్చని వివరించారు.
తెలంగాణ డేటా రిచ్ స్టేట్ అని పేర్కొంటూ, ప్రజారోగ్య విధానాల రూపకల్పనలో ఈ సమాచారం కీలకంగా ఉపయోగపడుతుందని అన్నారు. ఫ్లోరైడ్ సమస్యతో పాటు మూసీ నది కాలుష్యం నల్గొండ జిల్లా ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నల్గొండ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలంటే మూసీ నది ప్రక్షాళన అవసరమని స్పష్టం చేశారు.
* విద్యార్థులకు అంతర్జాతీయ అవకాశాలు..
జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో విద్య, నీటిపారుదల రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారని సీఎం గుర్తుచేశారు. అప్పట్లో ఏర్పాటు చేసిన ప్రముఖ విద్యాసంస్థలు, చేపట్టిన ప్రాజెక్టులు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయని వివరించారు. వాటి ఫలితంగా దేశం ఆహార కొరత నుంచి మిగులు ఆహార ధాన్యాల స్థాయికి చేరుకుందని పేర్కొన్నారు.
తెలంగాణలోని మారుమూల గ్రామానికి చెందిన విద్యార్థి కూడా న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో పనిచేసే వారితో పోటీపడే స్థాయికి ఎదగాలన్నదే తన ఆకాంక్ష అని చెప్పారు. విద్యాసంస్థలు, పెట్టుబడిదారుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి వివక్ష చూపదని స్పష్టం చేశారు. ఐఎస్బీ, నల్సార్ వంటి విద్యాసంస్థలు హైదరాబాద్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాయని తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు కూడా హైదరాబాద్‌లో తమ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయని చెప్పారు.
* తెలంగాణ రైజింగ్ 2047.. గ్లోబల్ సమ్మిట్‌కు సిద్ధం..
తెలంగాణను 2047 నాటికి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌ను రూపొందించినట్లు సీఎం తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలను క్యూర్, ప్యూర్, రేర్ అనే మూడు జోన్లుగా విభజించి ముందుకు సాగుతున్నామని వివరించారు.
పెట్టుబడులను ఆకర్షించడం, అంతర్జాతీయ పారిశ్రామిక సంస్థలను రాష్ట్రానికి తీసుకురావడం లక్ష్యంగా డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 నిర్వహించనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు హాజరుకానున్నారు. రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాలను అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేయడంతో పాటు, వివిధ రంగాల్లో కొత్త భాగస్వామ్యాలకు ఈ సదస్సు వేదిక కానుంది.
తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని, పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో పీహెచ్ఎఫ్ఐ చాన్సలర్ డాక్టర్ కె. శ్రీనాథ్ రెడ్డి, ప్రో-చాన్సలర్ ప్రొఫెసర్ సంజయ్ జోడ్పే, అఫీషియేటింగ్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎం. విష్ణువర్ధన్ రావు, పారిశ్రామికవేత్త శ్రీని రాజు, పీహెచ్ఎఫ్ఐ చైర్మన్ రజత్ గుప్తా, బోర్డు సభ్యుడు మధుమోహన్ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

