హీరోయిన్ సాత్విక వీరవల్లి ఇంటర్వ్యూ
* తెలుగు త్వరగానే అలవాటైంది..
* మీడియా చిట్ చాట్ లో ‘ఆకాశంలో ఒక తార’ హీరోయిన్ సాత్విక వీరవల్లి
ఆకేరు న్యూస్, సినిమా :
వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న డిఫరెంట్ ఎమోషనల్ డ్రామా ‘ఆకాశంలో ఒక తార (Aakasamlo Oka Tara)’. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
* ‘ఆకాశంలో ఒక తార’ హీరోయిన్ గా సాత్విక వీరవల్లి..
సాత్విక వీరవల్లి (Satvika Veeravalli) కథానాయికగా పరిచయమవుతుండగా, శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘ఆకాశంలో ఒక తార’ నవంబర్ 20న తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ సాత్విక వీరవల్లి మీడియాతో చిట్ చాట్ చేసింది.

ప్రశ్న : మీ నేపథ్యం గురించి చెప్పండి? ఈ అవకాశం ఎలా వచ్చింది?
సాత్విక : నేను యూఎస్‌లో పుట్టి పెరిగాను. ఇంజనీరింగ్, మాస్టర్స్ పూర్తి చేసిన తర్వాత ఒక సంస్థలో రెండేళ్లు ఇంజనీర్‌గా పనిచేశాను. క్రియేటివ్ రంగంలోకి వస్తే బాగుంటుందనిపించింది. మొదట ‘కాంత’ సినిమాకు ఆడిషన్ ఇచ్చాను. కానీ అందులో ఎంపిక కాలేదు. అదే ప్రొడ్యూసర్ మరో తమిళ సినిమా ఉందని చెప్పడంతో అందులో ఆడిషన్ ఇచ్చాను.
ఆ సినిమాకు ఎంపిక కావడంతో ఇండియా వచ్చాను. కొన్ని రోజుల తర్వాత ‘ఆకాశంలో ఒక తార’ అవకాశం వచ్చింది. దీంతో నా ఉద్యోగాన్ని పక్కనపెట్టి నటన వైపు వచ్చాను. మా ఇంట్లో నాన్నగారు ఒక్కరే తెలుగు మాట్లాడతారు. అయితే ఇంట్లో తెలుగు వాతావరణం ఉండటంతో నాకు తెలుగు త్వరగానే అలవాటైయింది. ఈ సినిమా కోసం లాంగ్వేజ్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. నాకు కర్ణాటక సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. అలాగే భరతనాట్యం కూడా నేర్చుకున్నాను.
ప్రశ్న : ఇండస్ట్రీలోకి రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు?
సాత్విక: చిన్నప్పటి నుంచి ఇంట్లో నాకు చాలా ప్రోత్సాహం ఉండేది. ఏదైనా సాధించగలనని మా తల్లిదండ్రులు నమ్మేవారు. అలాంటి ప్రోత్సాహం ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా సాధించవచ్చు అని నేను నమ్ముతాను.
ప్రశ్న : ఇందులో మీ పాత్ర ఎలా ఉండబోతుంది?
సాత్విక : ఇందులో నా పాత్ర నాకు చాలా ఇష్టం. చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్. అయితే నా రియల్ లైఫ్ వ్యక్తిత్వం అలా ఉండదు. నాకు ఏదైనా అనిపిస్తే మొహం మీదే చెప్పేస్తాను. సినిమాలో నా పాత్ర చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడూ అంతరిక్షం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. నా బాల్యంలో మాత్రం నేను కూడా ఇలాగే అమాయకంగా ఉండేదాన్ని. ఆ జ్ఞాపకాలను ఈ పాత్ర చేయడానికి ఉపయోగించుకున్నాను.
ఇందులో నా పాత్ర చాలా మృదువుగా మాట్లాడుతుంది. అంతరిక్షంలోకి వెళ్లాలన్నదే తన లక్ష్యం. చుట్టుపక్కల వాళ్లు తనను ఎంత కించపరిచినా, అవేవీ పట్టించుకోకుండా తన లక్ష్యం వైపే దృష్టి పెడుతుంది. ఈ క్యారెక్టర్ ప్రతి రంగంలో ఉన్నవారికీ ఉపయోగపడుతుంది. మనం ఏ రంగంలోనైనా రాణించాలంటే కచ్చితంగా మన మీద మనకు విశ్వాసం ఉండాలి. ఇతరులు ఏమనుకుంటున్నారో పట్టించుకోకుండా ముందుకు వెళ్లాలి.
ప్రశ్న : ఈ క్యారెక్టర్ చేయడానికి ఎలాంటి హోంవర్క్ చేశారు?
సాత్విక : నాకు సైన్స్ మీద కొంత అవగాహన ఉంది. అయితే ఇంజనీరింగ్‌కు, ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌కు చాలా వ్యత్యాసం ఉంటుంది. అయినప్పటికీ నాకు ఒక పునాది ఉండటంతో మిగతా విషయాలన్నీ అర్థం చేసుకోగలిగాను. అలాగే స్క్రిప్ట్‌ను కూడా చాలా లోతుగా అర్థం చేసుకున్నాను.
ప్రశ్న : దుల్కర్ సల్మాన్‌తో కలిసి నటించడం ఎలా అనిపించింది?
సాత్విక : దుల్కర్ నాకు చాలా సపోర్ట్ చేశారు. ఆయన చాలా మంచి వ్యక్తి. మొదటి రోజు షూటింగ్లో నేను చాలా టెన్షన్ పడ్డాను. ఇందులో ఒక జాతర సీన్ ఉంది. అందులో చాలా మంది మధ్యలో నటించాల్సి ఉంటుంది. మొదట్లో చాలా భయపడ్డాను. ఆ సమయంలో దుల్కర్ గారు ఇచ్చిన సపోర్ట్‌ను ఎప్పటికీ మర్చిపోలేను.

పశ్న : శ్రుతి హాసన్, రుహాని శర్మలతో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది?
సాత్విక : శ్రుతి హాసన్, రుహాని శర్మ అద్భుతమైన పెర్ఫార్మర్స్. అలాంటి వాళ్లతో కలిసి పనిచేసే అవకాశం రావడం చాలా ఆనందంగా అనిపించింది. రుహానీ గారిని తొలిసారి కలిసినప్పుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఏదైనా హెల్ప్ కావాలంటే నన్ను అడగమని చెప్పారు. శ్రుతి హాసన్ గారు ఒక పవర్‌హౌస్. ఆమె నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను.
ప్రశ్న : యూఎస్‌లో పుట్టి పెరిగిన మీరు ఈ సినిమాలో విలేజ్ అమ్మాయిగా నటించారు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అనిపించింది?
సాత్విక : నిజానికి ఈ ట్రాన్స్ఫర్మేషన్ చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. స్కూల్ డ్రెస్ లో నన్ను నేను అద్దంలో చూసుకున్నప్పుడు చాలా సర్ప్రైజ్ అయ్యాను. నేను ఇలా కూడా కనిపించవచ్చా అనిపించింది. మా అమ్మ కూడా నాలో వచ్చిన ఈ మార్పును చూసి చాలా హ్యాపీగా ఫీలైంది.
నా జీవితంలో ఎప్పుడూ అనుభవించని ఒక పాత్రను ఎక్స్పీరియన్స్ చేయడం నాకు కొత్త అనుభూతిని ఇచ్చింది. ఆ పాత్రలో చాలా మ్యాజిక్ ఉంది. నటిగా అనేక పాత్రలో జీవించవచ్చు. అది కేవలం సినిమా ఇచ్చే మ్యాజిక్. సినిమాలోనే అది సాధ్యపడుతుంది. అలాంటి అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా ఆ పాత్రకు న్యాయం చేయాలి.
ప్రశ్న : ఈ సినిమాలో స్ఫూర్తిని ఇచ్చే అంశం ఏమిటి?
సాత్విక : ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని అంటుంటారు. ఈ సినిమాలో ఒక అమ్మాయి విజయం వెనుక ఒక గొప్ప మనసున్న అబ్బాయి ఉంటాడు. నా దృష్టిలో ఈ రెండు అంశాలూ ఉండాలి. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్తే జీవితం చాలా అందంగా ఉంటుంది. ఈ సినిమా ఖచ్చితంగా గొప్ప అనుభూతిని అందిస్తుంది.
ప్రశ్న : నెక్స్ట్ చేయబోతున్న సినిమాల గురించి?
సాత్విక : తమిళంలో ఒక ప్రాజెక్ట్ (Satvika Veeravalli) చేస్తున్నాను. అలాగే తెలుగులో కూడా ఒక ప్రాజెక్ట్ ఉంది. త్వరలోనే వాటి గురించి అనౌన్స్మెంట్స్ వస్తాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

