విష్ణుదేవ్ సాయి, రేవంత్ రెడ్డి
* ఎన్ఓసీ కోసం ఛత్తీస్‌గఢ్ సీఎంకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి..
* త్వరగా ప్రక్రియ పూర్తి చేస్తామని విష్ణుదేవ్ సాయి హామీ
ఆకేరు న్యూస్, డెస్క్: తెలంగాణలో సాగు, తాగునీటి అవసరాలకు కీలకంగా మారనున్న సమ్మక్క సాగర్ బ్యారేజీకి నిరభ్యంతర పత్రం (NOC) జారీ చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయిని కోరారు. రాయ్‌పూర్‌లో ఇరువురు ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. ఈ భేటీలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరించిన రేవంత్ రెడ్డి.. ఎన్ఓసీతో పాటు మిగిలిన అనుమతుల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.
Also Read: పీవీ విజ్ఞాన కేంద్రంలో కలెక్టర్ పర్యటన.
ఎన్ఓసీపై సానుకూల హామీ
రేవంత్ రెడ్డి విజ్ఞప్తిపై ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి సానుకూలంగా స్పందించారు. ఎన్ఓసీ జారీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఎల్‌నినో (El Niño) ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో నీటి అవసరాలు పెరిగే అవకాశముందని రేవంత్ రెడ్డి వివరించారు. సమ్మక్క సాగర్ బ్యారేజీలో గోదావరి జలాలను నిల్వ చేసుకునేందుకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని కోరారు.
కాంతనపల్లి నుంచి తుపాకులగూడెంకు మార్పు
తొలుత ఈ ప్రాజెక్టును కాంతనపల్లి వద్ద నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే అక్కడ బ్యారేజీ నిర్మిస్తే సుమారు 11,408 ఎకరాల భూమి ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని అంచనా వేశారు. దీంతో 17 ఆదివాసీ గ్రామాలు ప్రభావితమయ్యే అవకాశం ఉండటంతో పాటు భద్రత, మౌలిక సదుపాయాలపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని గుర్తించారు. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ముంపు ప్రభావాన్ని తగ్గించేందుకు బ్యారేజీ నిర్మాణ ప్రాంతాన్ని ములుగు జిల్లా తుపాకులగూడెంకు మార్చారు.

ఐఐటీ నివేదికలో కీలక అంశాలు
ప్రాజెక్టుపై అధ్యయనం చేయాలని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కోరడంతో తెలంగాణ ప్రభుత్వం రూ.9.883 కోట్లను ఏప్రిల్‌లోనే చెల్లించింది. ఐఐటీ ఖరగ్‌పూర్ (IIT Kharagpur) తన అధ్యయన నివేదికను జూలై 30న ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం తుపాకులగూడెం వద్ద బ్యారేజీ నిర్మాణం వల్ల ఛత్తీస్‌గఢ్‌లో సుమారు 33 ఎకరాల భూమి మాత్రమే ముంపునకు గురవుతుందని వెల్లడైంది. భారీ వరదల సమయంలోనూ ప్రభావిత ప్రాంతం 100 ఎకరాలకు మించదని అధ్యయనంలో పేర్కొన్నట్లు తెలంగాణ ప్రభుత్వం వివరించింది.
6.94 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం
ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద గోదావరి నదిపై సమ్మక్క సాగర్ బ్యారేజీ నిర్మాణం పూర్తయింది. బ్యారేజీ పూర్తిస్థాయి నీటిమట్టం +83 మీటర్ల వద్ద 6.94 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది. కరువు ప్రభావిత, వెనుకబడిన, గిరిజన ప్రాంతాల్లో సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు గోదావరి జలాలను వినియోగించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం.
పరిహారం చెల్లించేందుకు సిద్ధం
ఛత్తీస్‌గఢ్‌లో భూసేకరణ, పరిహారం, పునరావాసానికి అవసరమైన నిధులను నిబంధనల ప్రకారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బ్యారేజీ నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎన్ఓసీని త్వరగా జారీ చేయాలని కోరారు. మిగిలిన అనుమతులను కూడా వేగంగా మంజూరు చేస్తే తెలంగాణలోని సాగు, తాగునీటి అవసరాలకు ఈ ప్రాజెక్టు మరింత ఉపయోగపడనుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

