శబరిమల, కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ (ఫైల్ ఫొటో)
* భారీ అభివృద్ధి ప్రాజెక్టుకు కేరళ ప్రభుత్వం సిద్ధం
* భక్తుల సంఖ్యను 50 శాతం పెంచడమే లక్ష్యం..
* కొచ్చి ఎయిర్పోర్టులో ప్రత్యేక యాత్రికుల కేంద్రం ప్రారంభం
ఆకేరు న్యూస్, డెస్క్: అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. శబరిమల క్షేత్రాన్ని తిరుమల తిరుపతి తరహాలో (Sabarimala Tirupati Model) ఆధునిక మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం భారీ ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ ప్రకటించారు. శబరిమల యాత్రను మరింత సౌకర్యవంతంగా మార్చడంతో పాటు భక్తుల సంఖ్యను 50 శాతం పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
* శబరిమలలో మెగా ప్రాజెక్టు..
శబరిమలలో దీర్ఘకాలిక ప్రాతిపదికన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనున్నట్లు సీఎం తెలిపారు. ప్రస్తుత మండల యాత్ర సీజన్ ముగిసిన తర్వాత సంబంధిత శాఖలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ప్రాజెక్టు కార్యాచరణపై చర్చించనున్నారు. శబరిమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం కల్పించడంతో పాటు యాత్ర మార్గాల్లోనూ అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు.
శబరిమల యాత్రను కేవలం ఒక ఆలయ దర్శనానికే పరిమితం చేయకుండా.. కేరళలోని ఇతర ఆలయాలను కూడా సందర్శించేలా తీర్థయాత్ర పర్యాటక నెట్వర్క్ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేక యాత్రికుల సౌకర్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ ఈ కేంద్రాన్ని నవంబర్ 17న ప్రారంభించారు. ఈ కేంద్రం 24 గంటల పాటు అందుబాటులో ఉంటుంది.
* ఒకేచోట అన్ని సౌకర్యాలు..
ఈ కేంద్రంలో భక్తుల కోసం పలు సదుపాయాలు కల్పించారు.
- హెలికాప్టర్ టికెట్ల బుకింగ్ కౌంటర్
- కేఎస్ఆర్టీసీ బస్సుల బుకింగ్ సౌకర్యం
- ప్రసాదం కూపన్ల కౌంటర్
- దేవస్వం హెల్ప్ డెస్క్
- ప్రీపెయిడ్ టాక్సీ బుకింగ్
- శాకాహార భోజనశాల
- ఏసీ విశ్రాంతి గది
- ఉచిత వైఫై
- విమానాల రాకపోకల తాజా సమాచారం కోసం డిస్ప్లే బోర్డు
కొచ్చి విమానాశ్రయం నుంచి శబరిమలకు కేఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నాయి. అవసరాన్ని బట్టి ప్రత్యేక బస్సులను సైతం బుక్ చేసుకునే అవకాశం కల్పించారు.
దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు ప్రతి మండల సీజన్లో శబరిమలకు వస్తుంటారు. వారికి మెరుగైన రవాణా, విశ్రాంతి, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం తెలిపారు. ఈ ప్రాజెక్టు (Sabarimala Tirupati Model) అమలుతో శబరిమలకు వచ్చే యాత్రికుల సంఖ్య 50 శాతం వరకు పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

