డీజీపీ సీవీ ఆనంద్, పోలీస్ ఉన్నతాధికారులు
* మరో 34 మందికి త్వరలో పదోన్నతులు..
* అదనపు ఎస్పీ, నాన్‌కేడర్ ఎస్పీ పోస్టుల భర్తీకి కసరత్తు
ఆకేరు న్యూస్, డెస్క్: తెలంగాణ పోలీస్ శాఖ (Telangana Police Department)లో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అధికారుల పదోన్నతులకు (Police Promotions) మార్గం సుగమమైంది. అదనపు ఎస్పీలు, నాన్‌కేడర్ ఎస్పీలుగా పదోన్నతులు కల్పించే అంశంపై అధికారుల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది.
డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand) ప్రత్యేక చొరవతో ఈ ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. సీనియారిటీ, రిజర్వేషన్ ఆఫ్ రోస్టర్ (RoR), ఖాళీలు, అర్హతలకు సంబంధించి నెలకొన్న వివాదాలను పరిష్కరించుకునేందుకు అధికారులు అంగీకరించారు.
1991, 1995, 1996 బ్యాచ్‌లకు చెందిన సివిల్ ఎస్సై అధికారులు (Civil SI Officers)తో మంగళవారం డీజీపీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం డీఎస్పీలు, అదనపు ఎస్పీలుగా పనిచేస్తున్న ఈ అధికారుల పదోన్నతులపై చర్చించారు. న్యాయస్థానాల్లో కొనసాగుతున్న కేసులు, వివాదాల కారణంగా అర్హులైన అధికారులు పదోన్నతులు కోల్పోకుండా చూడాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. పరస్పర అంగీకారంతో సమస్యలను పరిష్కరించుకుని పదోన్నతుల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడంపై చర్చించారు.
గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 74 (GO No.74) ప్రకారం పదోన్నతుల ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. అయితే, సీనియారిటీ జాబితాపై కొందరు అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వివాదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో కమిటీ నివేదిక, ప్రభుత్వ ఉత్తర్వులు, సంబంధిత నిబంధనలను ఉన్నతాధికారులు సమీక్షించారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు.
* తొలి విడతలో 54 మందికి పదోన్నతులు..
పదోన్నతుల ప్రక్రియలో భాగంగా తొలి విడతలో 54 మంది డీఎస్పీ/ఏసీపీ స్థాయి అధికారులకు (DSP ACP Officers) అదనపు ఎస్పీ/అదనపు డీసీపీలుగా పదోన్నతులు కల్పించేందుకు ఖాళీలు అందుబాటులో ఉన్నట్లు డీజీపీ వివరించారు. రెండో విడతలో వచ్చే ఏడాది ఆగస్టు నాటికి మరో 34 పోస్టులు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. ప్రతిపాదిత జాబితాల ప్రకారం పదోన్నతుల ప్రక్రియను కొనసాగించేందుకు ఆయా బ్యాచ్‌ల అధికారులు అంగీకారం తెలిపారు.
* 12 నాన్‌కేడర్ ఎస్పీ పోస్టులు తక్షణమే భర్తీ..
మరోవైపు, న్యాయపరమైన వివాదాలు లేని 12 నాన్‌కేడర్ ఎస్పీ పోస్టులను (Non-Cadre SP Posts) తక్షణమే భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. వీటితోపాటు ప్రస్తుత ప్యానల్ ఇయర్లో మరో 10 నాన్‌కేడర్ ఎస్పీ పోస్టులు కేటాయించనున్నట్లు వెల్లడించారు. దీంతో పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న పోలీసు అధికారులకు ఊరట లభించనుంది.
* సీఎం దృష్టికి పదోన్నతుల అంశం..
సమావేశంలో అధికారుల మధ్య కుదిరిన ఏకాభిప్రాయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దృష్టికి తీసుకెళ్తానని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. పదోన్నతుల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో మహిళా భద్రత విభాగం డీజీ సౌమ్య మిశ్రా, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

