కాళోజీ ఫౌండేషన్ వినతి
* సీఎం రేవంత్‌రెడ్డికి కాళోజీ ఫౌండేషన్ వినతి
ఆకేరు న్యూస్, వరంగల్ : హనుమకొండలో నిర్మించిన కాళోజీ కళాక్షేత్రంలో (Kaloji Kala Kshetram) కాళోజీ ఫౌండేషన్ కార్యకలాపాల నిర్వహణకు రెండు గదులు, ఒక చిన్న సమావేశ మందిరాన్ని కేటాయించాలని ఫౌండేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డిని కోరారు. కాళోజీ ఆశయాలకు అనుగుణంగా సాహిత్య, కళా, సాంస్కృతిక కార్యక్రమాలను నిరంతరం నిర్వహించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
* సాహిత్య, సాంస్కృతిక కేంద్రంగా ఉండాలి
పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత, ప్రజాకవి కాళోజీ నారాయణరావు స్వస్థలమైన హనుమకొండలో నిర్మించిన కాళోజీ కళాక్షేత్రం (Kaloji Kala Kshetram) తెలంగాణ ప్రజలకు గర్వకారణమని ఫౌండేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ భవన నిర్మాణ ఆలోచనకు అంకురార్పణ జరిగిందని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్థల కేటాయింపు తదితర ప్రక్రియలు పూర్తయ్యాయని వివరించారు.
అనంతరం నిర్మాణం ప్రారంభమై, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కళాక్షేత్రం ప్రారంభం కావడం సంతోషకరమని తెలిపారు. వరంగల్ ప్రాంతంలో సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలకు శాశ్వత వేదికగా ఈ కళాక్షేత్రం రూపుదిద్దుకోవడం పట్ల సాహిత్యాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.
గతంలో కాళోజీ ఫౌండేషన్‌కు గ్రంథాలయం, పఠనశాల (రీడింగ్ రూమ్) ఏర్పాటు చేసుకునేందుకు ఒక హాలు, రెండు గదులు కేటాయిస్తామని పలుమార్లు మౌఖికంగా, పత్రికా ప్రకటనల ద్వారా హామీలు లభించినప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదని వినతిపత్రంలో గుర్తుచేశారు.
* సాంస్కృతిక కార్యక్రమాలకే ప్రాధాన్యం..
కాళోజీ కళాక్షేత్రం నిర్మాణం వెనుక ప్రధాన ఉద్దేశం కాళోజీ ఆశయాలకు అనుగుణంగా సాహిత్య, కళా, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించడమేనని ఫౌండేషన్ అభిప్రాయపడింది. ఇలాంటి ప్రత్యేక ప్రయోజనం కోసం నిర్మించిన కళాక్షేత్రాన్ని ఇతర ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు వినియోగించడం సముచితం కాదని పేర్కొంది. భవనంలో ఇతర ప్రభుత్వ సంస్థలకు కార్యాలయాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటే వాటికి ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించాలని కోరింది.
కళాక్షేత్రంలో కార్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను పునఃపరిశీలించి, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలకు ఇబ్బంది కలగకుండా చూడాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసింది.
* ఫౌండేషన్ ప్రధాన డిమాండ్లు ఇవే..
కాళోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరంతరం సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు కళాక్షేత్రంలో రెండు గదులు, ఒక చిన్న సమావేశ మందిరాన్ని కేటాయించాలని కోరింది. గ్రంథాలయం, పఠనశాల ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సంబంధిత అధికారులకు స్పష్టమైన ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసి, కేటాయింపులను అధికారికంగా ఖరారు చేయాలని కోరింది.
హైదరాబాద్‌లోని రవీంద్రభారతి తరహాలో కాళోజీ కళాక్షేత్రం తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా నిలవాలని ఫౌండేషన్ ఆకాంక్షించింది. ఇది కేవలం స్థానిక సమావేశాల నిర్వహణకే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రజల సాహిత్య, సాంస్కృతిక వికాసానికి కేంద్రంగా మారాలని అభిప్రాయపడింది. కాళోజీ పేరుతో నిర్మించిన ఈ కళాక్షేత్రం ప్రజా సమూహాల వికాస కేంద్రంగా నిలవాలని పేర్కొంది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యక్తిగతంగా ఈ విషయంపై దృష్టి సారించి, కాళోజీ ఫౌండేషన్‌కు అవసరమైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రతినిధులు కోరారు. కాళోజీ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక వికాసానికి కాళోజీ కళాక్షేత్రం కేంద్రంగా నిలిచేలా ప్రభుత్వం సహకరించాలని వినతిపత్రంలో విజ్ఞప్తి చేశారు.
Also Read : ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్..!

Please tell us what is wrong. Your report will be sent to the website team.

