‘అక్వాన్’ తుఫాను
* పొంచి ఉన్న అక్వాన్ ముప్పు
* అత్యంత భారీ వర్షాలు కురిసే చాన్స్
ఆకేరు న్యూస్, అమరావతి : బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ‘అక్వాన్’ తీవ్ర తుపాను (Aqvan Cyclone) ప్రస్తుతం గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కదులుతూ తీరం వైపు దూసుకొస్తుండటంతో ఉత్తరాంధ్ర జిల్లాలకు అధికారులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. వాతావరణ శాఖ (Weather Department) అంచనాల ప్రకారం ఈ తుపాను ఎల్లుండి ఆంధ్రప్రదేశ్లోని నరసాపురం – ఒడిశాలోని పూరీ మధ్య తీరం దాటే అవకాశం ఉంది.
తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో.. గరిష్టంగా 120 కి.మీ. వరకు బలమైన పెనుగాలులు వీచే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో తీర ప్రాంతాల్లో రెడ్, ఆరెంజ్ అలర్ట్లు జారీ చేశారు.
* రక్షణ చర్యలు ముమ్మరం..
తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) సహాయక, ముందస్తు రక్షణ చర్యలను ముమ్మరం చేశాయి. అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు 13 ఎన్డీఆర్ఎఫ్ (NDRF), 11 ఎస్డీఆర్ఎఫ్ (SDRF) బృందాలను ఇప్పటికే ప్రభావిత జిల్లాలకు తరలించి సిద్ధంగా ఉంచారు.
సముద్రం అత్యంత అల్లకల్లోలంగా మారి, అలలు సాధారణం కంటే ఎత్తుకు ఎగసిపడే ప్రమాదం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని కఠిన ఆదేశాలు జారీ అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు, సముద్ర తీరానికి ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రత్యేక పునరావాస కేంద్రాలను సిద్ధం చేయడంతో పాటు తాగునీరు, ఆహారం, మందులను అందుబాటులో ఉంచారు.
* పెనుగాలులతో జాగ్రత్త..
తుపాను తీరం దాటే సమయంలో పెనుగాలులు, కుండపోత వర్షాల వల్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలడం, లోతట్టు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించడం వంటి ప్రమాదాలు ఉన్నందున ఉత్తరాంధ్ర ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ (Prakhar Jain) స్పష్టం చేశారు.
ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, పాతబడిన, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించే వారు తక్షణమే సురక్షిత భవనాల్లోకి మారాలని ఆయన సూచించారు. కోతకు సిద్ధంగా ఉన్న వరి, ఇతర పంటలను రక్షించుకునేందుకు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వ అధికారుల హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ సహాయక చర్యలకు సహకరించాలని ప్రఖర్ జైన్ విజ్ఞప్తి చేశారు.
Also Read : బాధితులకు పవన్ కల్యాణ్ భరోసా

Please tell us what is wrong. Your report will be sent to the website team.

