చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్
* మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ
ఆకేరు న్యూస్, భీమదేవరపల్లి : అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఎలాంటి రాజకీయ వివక్ష లేకుండా ప్రభుత్వ చేయూత పింఛన్లు అందిస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. గతంలో అర్హత ఉన్నప్పటికీ పింఛన్లు పొందలేకపోయిన వారికి కూడా ప్రాధాన్యతనిస్తూ పింఛన్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములుకనూరులో నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను మంత్రి లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భీమదేవరపల్లి మండలంలో కొత్తగా 837 చేయూత పింఛన్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. అర్హత ఉండి గతంలో పింఛన్లు పొందలేకపోయిన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
* ఆరు గ్యారెంటీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది..
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుతో పాటు మహిళా సంక్షేమం, రైతుల సంక్షేమం, విద్య, వైద్యం, గ్రామీణ అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని 173 గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను దశలవారీగా ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామంలో ప్రజలకు అవసరమైన సదుపాయాలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.
* దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేక శిబిరాలు..
దివ్యాంగులు, వృద్ధులకు అవసరమైన ఉచిత సహాయక ఉపకరణాలను అందించేందుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నామని మంత్రి వెల్లడించారు. అర్హులైన వారికి అవసరమైన పరికరాలను అందించి వారి దైనందిన జీవితాన్ని మరింత సులభతరం చేయడమే లక్ష్యమని చెప్పారు. అలాగే నియోజకవర్గంలో సాగునీటి సమస్యల పరిష్కారం, విద్యాసంస్థల ఏర్పాటు, క్రీడా ప్రాంగణాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు.
* సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్లు..
ప్రజల అవసరాలను గుర్తించి సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను సమాంతరంగా కొనసాగిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి తమ ప్రభుత్వానికి రెండు కళ్ల వంటివని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా పనిచేస్తామని, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు.
ములుకనూరులో నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ల పత్రాల పంపిణీతో అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక భరోసా కల్పించడమే కాకుండా, ప్రభుత్వ సంక్షేమ పథకాలు చివరి అర్హుడి వరకు చేరాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని మంత్రి వెల్లడించారు.
Also Read : ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్..!

Please tell us what is wrong. Your report will be sent to the website team.

