కేయూ కాంట్రాక్ట్ అధ్యాపకుల ఉద్యమ కార్యాచరణ కమిటీ నాయకులు
* రెగ్యులరైజేషన్‌కు డిమాండ్!
* నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన
* రెగ్యులర్ నియామకాలకు ముందే క్రమబద్ధీకరించాలి
ఆకేరు న్యూస్, వరంగల్: తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించడంతో పాటు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) పే స్కేల్‌ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కాకతీయ యూనివర్సిటీ (Kakatiya University) కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు నిరసన చేపట్టారు. రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో రెండు దశాబ్దాలకు పైగా సేవలందిస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ నియామకాలకు ముందే క్రమబద్ధీకరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆందోళనలో భాగంగా కేయూ క్యాంపస్‌తో పాటు అనుబంధ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా కేయూ కాంట్రాక్ట్ అధ్యాపకుల ఉద్యమ కార్యాచరణ కమిటీ నాయకులు డా. పి. కరుణాకర్ రావు, డా. సాధు రాజేష్ మాట్లాడుతూ.. గతేడాది 11 రోజుల పాటు నిర్వహించిన సమ్మె సందర్భంగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా యూజీసీ పే స్కేల్ (UGC Pay Scale) అమలుపై ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కోరారు.
రెండు దశాబ్దాలకు పైగా విశ్వవిద్యాలయాల అభివృద్ధికి కాంట్రాక్ట్ అధ్యాపకులు విశేష సేవలందిస్తున్నప్పటికీ, ఇప్పటికీ ఉద్యోగ భద్రత లేకపోవడం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సుదీర్ఘకాలంగా విధులు నిర్వహిస్తున్నా తమ సేవలు క్రమబద్ధీకరణకు నోచుకోకపోవడంతో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఉద్యోగ భద్రత, భవిష్యత్తుపై స్పష్టత లేకపోవడం అధ్యాపకుల్లో ఆందోళనకు కారణమవుతోందన్నారు.
ప్రభుత్వం ఇప్పటికైనా మానవతా దృక్పథంతో స్పందించి, రెగ్యులర్ నియామకాలు చేపట్టే ముందే దీర్ఘకాలంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సేవలను క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను కేవలం ప్రకటనలకే పరిమితం చేయకుండా కార్యరూపంలోకి తీసుకురావాలని కోరారు.
ఈ నిరసన కార్యక్రమంలో వివిధ కళాశాలలు, విభాగాలకు చెందిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు డా. బైరి నిరంజన్, డా. రంగారెడ్డి, డా. నాగేశ్వరరావు, డా. చంద్రశేఖర్, డా. సూర్యనారాయణ, డా. ఆరూరి సూర్యం, డా. మామిడి లింగయ్య, డా. శ్రీనివాస్, డా. కృష్ణయ్య, డా. ప్రసాద్, డా. స్వామి, డా. జుల సత్య, తూర్పాటి వెంకటేష్, డా. స్వప్న, డా. కవిత, డా. భాగ్య, డా. కల్పన, డా. రమ, డా. శ్రీలత, డా. సుచరిత పాల్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: కృష్ణా జలాలపై కేటీఆర్ ఫైర్..!

Please tell us what is wrong. Your report will be sent to the website team.

