నిమ్స్ ఆసుపత్రి (ఫైల్ ఫొటో)
* ఒక్కో బెడ్‌కు రూ.లక్ష లంచం..!
* టెండర్లలో భారీ అవకతవకలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో వెలుగుచూస్తున్న (NIMS Hospital Corruption) అక్రమాల వ్యవహారం మరింత విస్తరిస్తోంది. ఇప్పటికే ఆసుపత్రి అదనపు మెడికల్ సూపరింటెండెంట్ నోరి లక్ష్మీభాస్కర్‌పై నమోదైన కేసులో దర్యాప్తు చేస్తున్న అవినీతి నిరోధక శాఖ (ACB).. తాజాగా ఆసుపత్రిలో జరిగిన టెండర్లు, నియామకాలు, ఔట్సోర్సింగ్ కాంట్రాక్టులపై కూడా దృష్టి సారించింది.
క్యాంటీన్లు, మెడికల్ షాపులు, హౌస్‌కీపింగ్, సెక్యూరిటీ వంటి విభాగాల్లో టెండర్ల కేటాయింపుల సమయంలో అవకతవకలు జరిగినట్లు అనుమానిస్తూ రికార్డులను పరిశీలిస్తోంది. కోవిడ్ సమయంలో ఆసుపత్రిలో బెడ్ల కేటాయింపుల పేరుతో డబ్బులు వసూలు చేసిన వ్యవహారం కూడా మరోసారి చర్చకు వచ్చింది. ఒక్కో బెడ్ కేటాయింపునకు రూ.లక్ష వరకు లంచం తీసుకున్నట్లు ఏసీబీ విచారణలో గుర్తించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ప్రశాంత్ అనే వ్యక్తితో కలిసి లక్ష్మీభాస్కర్ అక్రమాలకు (NIMS Hospital Corruption) పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
* 2014 నుంచి టెండర్లపై ఆరా..
నిమ్స్‌లో 2014 నుంచి జరిగిన నియామకాలు, కొనుగోళ్లు, ఔట్సోర్సింగ్ కాంట్రాక్టులకు సంబంధించిన రికార్డులను ఏసీబీ పరిశీలిస్తోంది. అక్టోబర్ 29, 30 తేదీల్లో ఏసీబీ, ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ కంట్రోల్ విభాగాల అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.
ఆసుపత్రిలోని స్టోర్స్, మ్యాన్‌పవర్ రిక్రూట్మెంట్, సెక్యూరిటీ, క్యాంటీన్, సర్జికల్ స్టోర్స్, మెడికల్ షాపుల విభాగాల్లో తనిఖీలు చేపట్టారు. సుమారు 540 మందికి పైగా ఉద్యోగుల నియామకాల్లో ఒక్కొక్కరి నుంచి రూ.60 వేల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు రావడంతో ఆ దిశగా కూడా విచారణ సాగుతోంది. టెండర్లు, బిల్లుల చెల్లింపులు, కాంట్రాక్టుల కేటాయింపులకు సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
* క్యాంటీన్, మెడికల్ షాపుల నుంచి భారీగా వసూళ్లు..
నిమ్స్‌లోని క్యాంటీన్, మెడికల్ షాపుల నుంచి లంచాలు వసూలు చేసినట్లు ఏసీబీకి ప్రాథమిక ఆధారాలు లభించినట్లు వార్తా కథనాలు వెల్లడించాయి. ఈ రెండు విభాగాల నుంచే ఏడాదికి సుమారు రూ.50 లక్షల వరకు లంచాల రూపంలో చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఎంత ఉందనే కోణంలో అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.
* రూ.6.13 కోట్ల ఆస్తుల కేసు..
లక్ష్మీభాస్కర్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసును కూడా ఏసీబీ నమోదు చేసింది. సెప్టెంబర్ 22న ఆయన నివాసంతో పాటు బంధువులు, సన్నిహితులు, అనుమానిత బినామీలకు సంబంధించిన ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో ఎనిమిది ఫ్లాట్లు, ఐదు ఓపెన్ ప్లాట్లకు సంబంధించిన పత్రాలతో పాటు బ్యాంకు నిల్వలు, పెట్టుబడులు, బంగారు ఆభరణాలు, వాహనాలు గుర్తించినట్లు ఏసీబీ వెల్లడించింది.
వీటి నమోదిత విలువ సుమారు రూ.6.13 కోట్లుగా పేర్కొంది. పత్రాల్లో ఆస్తుల విలువ రూ.6.13 కోట్లుగా ఉన్నప్పటికీ.. వాటి మార్కెట్ విలువ రూ.100 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ అంచనా వేసినట్లు సమాచారం.. ఈ కేసులో లక్ష్మీభాస్కర్‌ను అరెస్టు చేసి విచారించిన ఏసీబీ.. అనంతరం మరికొన్ని ప్రాంతాల్లోనూ సోదాలు నిర్వహించింది. నిమ్స్‌లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగుల ఇళ్లలో నగదు, ఆస్తులకు సంబంధించిన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
* లక్ష్మీభాస్కర్‌కు బెయిల్..
ఈ కేసులో న్యాయస్థానం లక్ష్మీభాస్కర్‌కు నవంబర్ 17న షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు ఇద్దరు ష్యూరిటీలు సమర్పించాలని, ప్రతి మంగళవారం ఏసీబీ డీఎస్పీ ఎదుట హాజరుకావాలని కోర్టు ఆదేశించినట్లు వార్తా కథనాలు వెల్లడించాయి. అయితే నిమ్స్‌లో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్థిక, పరిపాలనా అక్రమాలపై ఏసీబీ విచారణ కొనసాగుతోంది.
నిమ్స్ వంటి ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందాల్సిన వైద్య సేవలు, బెడ్ల కేటాయింపులు, ఉద్యోగ నియామకాలు, కాంట్రాక్టుల వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. దర్యాప్తు పూర్తయితే ఈ వ్యవహారంలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Also Read : రాజకీయాలకు అతీతంగా పింఛన్లు..!

Please tell us what is wrong. Your report will be sent to the website team.


1 thought on “NIMS Hospital Corruption | నిమ్స్‌లో అక్రమాల కలకలం..!”