తొలిముద్ద పథకాన్ని ప్రారంభించిన సీఎం (ఫైల్ ఫోటో)
* మరో 7 జిల్లాలకు ‘తొలిముద్ద’ పథకం
ఆకేరు న్యూస్, డెస్క్ : అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తొలిముద్ద’ (Tholimudda Scheme) అల్పాహార పథకాన్ని మరిన్ని జిల్లాలకు విస్తరిస్తోంది. ఇందులో భాగంగా నవంబర్ 19 నుంచి మరో ఏడు జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. జయశంకర్ భూపాలపల్లి, జనగామ, రాజన్న సిరిసిల్ల, హనుమకొండ, పెద్దపల్లి, వరంగల్, వనపర్తి జిల్లాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఉదయం అల్పాహారం అందించనున్నారు.
* కొత్తగా 43,657 మంది చిన్నారులకు ప్రయోజనం..
తాజా విస్తరణతో ఈ ఏడు జిల్లాల్లోని 3 నుంచి 6 సంవత్సరాల వయస్సు గల 43,657 మంది చిన్నారులకు ప్రతిరోజూ ఉదయం అల్పాహారం (Breakfast Scheme) అందనుంది. పిల్లలు ఉదయం ఆకలితో అంగన్వాడీ కేంద్రాలకు రాకుండా చూడటంతోపాటు, వారి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అవసరమైన పోషకాలను అందించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం.
* ఇప్పటికే ఏడు జిల్లాల్లో అమలు..
రాష్ట్రంలోని ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కుమురం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, ములుగు, నాగర్కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో తొలిముద్ద కార్యక్రమం ఇప్పటికే కొనసాగుతోంది. ఈ జిల్లాల్లోని 8,694 అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రతిరోజూ 91,796 మంది చిన్నారులకు అల్పాహారం అందిస్తున్నారు. తాజాగా మరో ఏడు జిల్లాలు చేరడంతో మొత్తం 14 జిల్లాల్లో 1,35,453 మంది చిన్నారులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కలగనుంది.
* పోషకాహారంతో కూడిన ప్రత్యేక మెనూ..
చిన్నారులకు అందించే అల్పాహారంలో పోషక విలువలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఇందుకోసం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN), యునిసెఫ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ (IIMR) నిపుణుల సూచనలతో ప్రత్యేక మెనూ (Nutritious Food Menu) రూపొందించారు.
తెలంగాణ ఫుడ్స్ ద్వారా ఉప్మా మిక్స్, ఖిచిడీ మిక్స్ వంటి అల్పాహార మిశ్రమాలను తయారు చేస్తున్నారు. ఒక్కో చిన్నారికి రోజుకు సుమారు 116.25 కిలో కేలరీల శక్తితోపాటు 3.9 గ్రాముల ప్రోటీన్ అందించేలా వీటిని రూపొందించారు. వీటిలో ఐరన్, కాల్షియం, సోడియం, జింక్తోపాటు విటమిన్-ఎ, బి1, బి2, బి12, సి వంటి సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి.
* ఈ ఆర్థిక సంవత్సరంలోనే రాష్ట్రవ్యాప్తంగా అమలు..
అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల్లో చాలామంది ఉదయం అల్పాహారం తీసుకోకుండానే వస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆకలి కారణంగా పిల్లల ఏకాగ్రత, నేర్చుకునే సామర్థ్యం దెబ్బతినకుండా పౌష్టికాహారం (Child Nutrition) అందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఈ పథకం విస్తరణపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి చిన్నారికి నాణ్యమైన ఆహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే మిగిలిన 19 జిల్లాల్లోనూ తొలిముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో (Tholimudda Scheme) అమల్లోకి వస్తే అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు ఉదయం వేళల్లోనే పౌష్టికాహారం అందుబాటులోకి రానుంది. బాలల ఆరోగ్యం, పోషకాహార స్థాయిని మెరుగుపరచడంలో ఈ కార్యక్రమం కీలకంగా మారనుంది.
Also Read : హైదరాబాద్లో టీజీ సేఫ్ తనిఖీలు..!

Please tell us what is wrong. Your report will be sent to the website team.

