Walkathon
* హనుమకొండలో అవగాహన ర్యాలీ..
* బాల్యవివాహాలు, మానవ అక్రమ రవాణా నిర్మూలనే లక్ష్యం
ఆకేరు న్యూస్, హనుమకొండ, నవంబర్ 20: బాలల హక్కుల పరిరక్షణ, బాల్యవివాహాల నిర్మూలన, మానవ అక్రమ రవాణా నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు హనుమకొండలో గురువారం వాకథాన్ (Walkathon) నిర్వహించారు. బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా ‘నా రోజు.. నా హక్కులు.. నా భవిష్యత్’ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, మిషన్ వాత్సల్య ఆధ్వర్యంలో పోలీస్ కమిషనరేట్ నుంచి కలెక్టరేట్ వరకు వాకథాన్ కొనసాగింది. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ పోలీసులు, ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ, డాన్ బాస్కో నవజీవన్, షేర్ స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా సంక్షేమ అధికారి ఎం. విశ్వజ, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఇన్స్పెక్టర్ రమేష్, బాలల న్యాయ మండలి సభ్యురాలు డాక్టర్ గోపికా రాణి, కాకతీయ విశ్వవిద్యాలయ పాలక మండలి సభ్యురాలు డాక్టర్ కె. అనితా రెడ్డి జెండా ఊపి వాకథాన్ను ప్రారంభించారు.
పాటలతో బాలల హక్కులపై అవగాహన
వాకథాన్ అనంతరం కళాజాత బృందం ప్రత్యేక ప్రదర్శన నిర్వహించింది. పాటల ద్వారా బాలల హక్కుల ప్రాధాన్యతను వివరించింది. బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలు, వాటి నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలు, మానవ అక్రమ రవాణాను అరికట్టే మార్గాలపై ప్రజలకు అవగాహన కల్పించింది.
ఈ సందర్భంగా కలెక్టరేట్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ.. బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. బాలల హక్కుల ఒడంబడిక (Convention on the Rights of the Child) ప్రకారం జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ కార్యక్రమాల్లో పాల్గొనే హక్కులు కీలకమైనవని వివరించారు.
పిల్లలకు సురక్షితమైన వాతావరణం కల్పించడంతో పాటు వారి సమగ్ర అభివృద్ధికి అవసరమైన అవకాశాలు అందించాలని సూచించారు. బాలల హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
హక్కుల పరిరక్షణకు సంతకాల సేకరణ
‘నా రోజు.. నా హక్కులు.. నా భవిష్యత్’ నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా పిల్లలు తమ హక్కులపై అవగాహన పెంచుకుని, ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకునేలా ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. అనంతరం పిల్లలతో కలిసి బెలూన్లను గాల్లోకి ఎగురవేశారు. సంతకాల ప్రచార కార్యక్రమంలో (Signature Campaign) పాల్గొని బాలల హక్కుల పరిరక్షణకు మద్దతు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఎం. విశ్వజ, బాల రక్షా భవన్ కోఆర్డినేటర్ సీహెచ్ అవంతి, సిస్టర్ సహాయ, ఫాదర్ కోషి, డాక్టర్ కె. అనితా రెడ్డి, ఎర్ర శ్రీకాంత్, బత్తుల కరుణ, ఇన్చార్జి డీసీపీవో ఎస్. ప్రవీణ్ కుమార్, జేజేబీ సభ్యురాలు డాక్టర్ గోపికా రాణి, సీడీపీవోలు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

