Cyber Crime
* వారం రోజుల్లో 25 మంది అరెస్ట్!
ఆకేరు న్యూస్, హైదరాబాద్: సైబర్ నేరగాళ్ల ఆటలకు సైబరాబాద్ పోలీసులు చెక్ పెట్టారు. డిజిటల్ మోసాలు (Digital Frauds), ఆన్లైన్ ట్రేడింగ్ మోసాలు (Online Trading Frauds), నకిలీ ఉద్యోగాల పేరుతో జరుగుతున్న వంచనలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో కేవలం వారం రోజుల్లోనే 10 కీలక కేసులను ఛేదించి, వివిధ రాష్ట్రాలకు చెందిన 25 మంది నిందితులను అరెస్టు చేశారు. ఈ వివరాలను సైబర్ క్రైం డీసీపీ కె. పుష్ప శుక్రవారం వెల్లడించారు.
10 కేసులు.. 25 మంది అరెస్ట్
పోలీసులు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లలో డిజిటల్ అరెస్టు (Digital Arrest) మోసానికి సంబంధించి ఒకరిని, ఆన్లైన్ ట్రేడింగ్ మోసాల్లో ఐదుగురిని, పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడిన ఏడుగురిని, నకిలీ లింకుల ద్వారా జరిగే స్మిషింగ్ (Smishing) మోసాల్లో నలుగురిని అరెస్టు చేశారు. స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT) ఆధ్వర్యంలో నమోదైన సైబర్ మోసం కేసుల్లో మరో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు.
నకిలీ ఏసీబీ అధికారుల పేరుతో బెదిరింపులు
ప్రభుత్వ ఉన్నతాధికారులనే లక్ష్యంగా చేసుకుని నకిలీ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులుగా నటిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. గూగుల్ వంటి బహిరంగ వేదికల ద్వారా ప్రభుత్వ అధికారుల వివరాలు, ఫోన్ నంబర్లను సేకరించిన నిందితుడు నుతేటి జయకృష్ణ.. ‘నరేంద్ర’ అనే ఏసీబీ అధికారిగా పరిచయం చేసుకునేవాడు. తన సహచరురాలిని ‘డీఎస్పీ సుప్రజ’గా పరిచయం చేస్తూ నకిలీ సిమ్ కార్డుల ద్వారా ఫోన్ కాల్స్ చేసేవాడు.
అవినీతి ఆరోపణలపై త్వరలోనే మీ ఇళ్లు, కార్యాలయాలపై ఏసీబీ దాడులు జరగనున్నాయని అధికారులను భయపెట్టేవారు. కేసుల నుంచి తప్పించాలంటే భారీగా డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేసేవారు. ఈ ముఠా బెదిరింపులకు ఓ ఆర్అండ్బీ (R&B) ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ లొంగిపోయి, విడతలవారీగా ఫోన్‌పే (PhonePe) ద్వారా రూ.10 లక్షలు బదిలీ చేశారు. ఈ కేసులో నిందితుడు జయకృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు ఏసీబీ అధికారుల పేరుతో ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తే అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
బ్యాంకు ఖాతాలు అద్దెకిచ్చి చిక్కుల్లో..
సైబర్ మోసాల ద్వారా దోచుకున్న డబ్బును ఇతరుల బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించి, నగదు రూపంలోకి మార్చుకుంటున్న వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో మ్యూల్ అకౌంట్స్ (Mule Accounts) వినియోగిస్తున్న నేరగాళ్ల వ్యవహారాన్ని పోలీసులు గుర్తించారు.
కర్ణాటకలోని బళ్లారికి చెందిన శ్రీ శివ పార్వతి పెట్రోల్ పంప్, పార్వతి ఫిల్లింగ్ స్టేషన్ సిబ్బందిని నిందితులు సంప్రదించినట్లు దర్యాప్తులో తేలింది. డిజిటల్ లావాదేవీల ద్వారా పెట్రోల్ పంపుల బ్యాంకు ఖాతాలకు డబ్బులు పంపించి, అక్కడి నుంచి నగదు తీసుకునేందుకు సిబ్బందికి రెండు శాతం కమీషన్ ఆశ చూపినట్లు పోలీసులు గుర్తించారు. స్వల్ప కమీషన్ కోసం తమ బ్యాంకు ఖాతాలను సైబర్ నేరగాళ్లకు అందించిన నలుగురిని ఈ నెలలో అరెస్టు చేశారు.
బాధితులకు రూ.78.62 లక్షల తిరిగి చెల్లింపు
సైబర్ నేరాల నియంత్రణతో పాటు బాధితులకు న్యాయం చేసే దిశగా కూడా సైబరాబాద్ పోలీసులు చర్యలు చేపట్టారు. మొత్తం 38 కేసులకు సంబంధించి రూ.78,62,961 నగదును బాధితుల ఖాతాల్లోకి తిరిగి జమ చేశారు. సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తులకు బ్యాంకు ఖాతాలు, ఓటీపీలు, వ్యక్తిగత వివరాలు ఇవ్వవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

