రీజినల్ జాయింట్ డైరెక్టర్ కృష్ణవేణి
* బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత
* చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్లపై అవగాహన కలిగి ఉండాలి
* రీజినల్ జాయింట్ డైరెక్టర్ కృష్ణవేణి
ఆకేరు న్యూస్, ములుగు: నేటి బాలలే రేపటి పౌరులని, వారికి నాణ్యమైన విద్యతోపాటు ఆనందకరమైన బాల్యాన్ని అందించినప్పుడే ఉత్తమ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని వరంగల్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ కృష్ణవేణి అన్నారు. బాలల హక్కుల వారోత్సవాల ముగింపు సందర్భంగా శుక్రవారం ములుగు కలెక్టరేట్లో నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాలల హక్కుల ఒడంబడిక (Convention on the Rights of the Child) ప్రకారం పిల్లలకు అనేక హక్కులు కల్పించబడ్డాయని తెలిపారు. వాటిని పరిరక్షించే బాధ్యత ప్రభుత్వం, తల్లిదండ్రులతోపాటు సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బాలల హక్కుల ఉల్లంఘనకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వివిధ పాఠశాలల నుంచి హాజరైన విద్యార్థులను బాలల సంరక్షణ చట్టాలపై ప్రశ్నించి అవగాహనను తెలుసుకున్నారు. చట్టాల గురించి తెలుసుకోవడమే కాకుండా, సమస్యలు ఎదురైనప్పుడు ధైర్యంగా ముందుకు వచ్చి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అవసరమైనప్పుడు చైల్డ్ హెల్ప్‌లైన్ (1098), మహిళా హెల్ప్‌లైన్ (181), పోలీస్ అత్యవసర సేవలు (100) నంబర్లను సంప్రదించాలని కోరారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DMHO) గోపాలరావు మాట్లాడుతూ.. బాలలకు పౌష్టికాహారం తీసుకునే హక్కుతోపాటు ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరిగే హక్కు ఉందన్నారు. చదువుతోపాటు పౌష్టికాహారం కూడా బాలల ఎదుగుదలకు ఎంతో అవసరమని, చిన్నప్పటి నుంచే ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.
బాలల సంక్షేమ సమితి (Child Welfare Committee) ములుగు చైర్పర్సన్ కె. వసుధ మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో బాలలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. యుక్తవయసులో వచ్చే మార్పులను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించాలని, పిల్లలు మంచి మార్గంలో నడిచేలా మార్గనిర్దేశం చేయాలని సూచించారు. తెలిసీ తెలియని వయసులో జరిగే పొరపాట్లను సరిదిద్దుకొని మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని బాలలకు హితవు పలికారు.
జిల్లా సంక్షేమ అధికారి ఇ.పీ. ప్రేమలత మాట్లాడుతూ.. బాల్యంలోనే ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని క్రమశిక్షణతో వాటిని సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. మంచి నడవడిక, క్రమశిక్షణ కలిగిన వారే సమాజంలో ఉత్తమ పౌరులుగా గుర్తింపు పొందుతారని తెలిపారు. బాలల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వాలు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాయని పేర్కొన్నారు.
విద్యార్థులకు బహుమతుల ప్రదానం
ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన బాలబాలికలు నృత్యాలు, పాటలు, ఆటల పోటీల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు అతిథులు బహుమతులు అందజేసి అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, జువెనైల్ జస్టిస్ బోర్డు సభ్యుడు సుభాష్, డీసీఆర్బీ డీఎస్పీ కిషోర్ కుమార్, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ రజిత, బాలబాలికల ప్రతినిధులు కృష్ణప్రసాద్, హర్షిత, జిల్లాలోని నలుగురు సీడీపీవోలు, సూపర్వైజర్లు, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ హెల్ప్‌లైన్, సఖి, మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది, వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

