మంత్రి సీతక్క
* ఉపాధి హామీ పనులకు ప్రాధాన్యం
* అర్హులైన ప్రతి కుటుంబానికి జాబ్ కార్డు అందించాలి
* సర్పంచులు బాధ్యతగా పనిచేయాలి.. మంత్రి సీతక్క
ఆకేరు న్యూస్, ములుగు: గ్రామాల సమగ్ర అభివృద్ధితో పాటు గ్రామీణ ప్రజలకు విస్తృతంగా ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ప్రతి సర్పంచ్ తన పదవీకాలాన్ని గ్రామాభివృద్ధికి ఒక అవకాశంగా భావించి, తమ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు బాధ్యతతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
సోమవారం ములుగు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ్) (VB-G RAM G) పథకం కింద చేపట్టాల్సిన పనుల కార్యాచరణ ప్రణాళికపై సర్పంచులు, ఎంపీడీవోలు, సంబంధిత శాఖల అధికారులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క గ్రామాల అభివృద్ధి, ఉపాధి కల్పనపై అధికారులకు పలు సూచనలు చేశారు.
* ఉపాధి పనులకు ప్రాధాన్యత
గ్రామాల అభివృద్ధికి నిధుల కొరత లేదని, ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడే పనులను గుర్తించి చేపట్టాలని మంత్రి సూచించారు. ఎల్‌నినో (El Niño) ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో ఉపాధి పనులను విస్తృతంగా చేపట్టాలన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఉపాధి హామీ జాబ్ కార్డు (Job Card) అందేలా ఎంపీడీవోలు, సర్పంచులు ప్రత్యేక చొరవ చూపాలని ఆదేశించారు. ప్రతి ఆవాసంలో అర్హులను గుర్తించి జాబ్ కార్డుల కోసం దరఖాస్తులు చేయించాలని, ప్రతి 40 మంది ఉపాధి కూలీలకు ఒక మేట్ (Mate)ను నియమించి పనుల్లో భాగస్వామ్యాన్ని పెంచాలని సూచించారు.
* నీటి సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణ
గ్రామాల్లో నీటి సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి స్పష్టం చేశారు. జలసిరి కార్యక్రమం కింద ఊటకుంటలు, నీటికుంటలు, కట్టకుంటలు, బోర్వెల్ రీఛార్జ్ (Borewell Recharge) పనులతో పాటు చెక్‌డ్యామ్‌ల నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆహార ధాన్యాల ఉత్పత్తి సమృద్ధిగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో నీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.
* గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన
గ్రామాల్లో సీసీ రోడ్లు, మట్టి రోడ్లు, బీటీ రోడ్లు, తాగునీటి సౌకర్యాలు, కాలువలు, పాఠశాల భవనాలు, ప్రహరీ గోడలు, అంగన్వాడీ భవనాలు, షెడ్ల నిర్మాణం వంటి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. అటవీ ప్రాంతాల్లో సైతం అనుమతించిన అభివృద్ధి పనులు చేపట్టేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. నిరుపేద కుటుంబాలను గుర్తించి వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని, అభివృద్ధి కార్యక్రమాల్లో మహిళా సంఘాల (Women Self Help Groups) భాగస్వామ్యాన్ని పెంచాలని సూచించారు.
* ఆరు గ్రామపంచాయతీలకు జాతీయ స్థాయి గుర్తింపు లక్ష్యం
ములుగు జిల్లాలో కనీసం ఐదు నుంచి ఆరు గ్రామపంచాయతీలను జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని మంత్రి ఆకాంక్షించారు. డిసెంబర్ నుంచి మే, జూన్ వరకు గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ములుగు జిల్లాను అన్ని రంగాల్లో ఆదర్శవంతమైన జిల్లాగా, ములుగు నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇందుకోసం సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
* వీడియో కాన్ఫరెన్స్‌లో పంచాయతీరాజ్ కమిషనర్ సూచనలు
హైదరాబాద్ నుంచి పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్ వీడియో కాన్ఫరెన్స్ (Video Conference) ద్వారా సమావేశంలో పాల్గొని సర్పంచులు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి జాబ్ కార్డు ఉండేలా చూడాలని, ప్రతి 40 మంది ఉపాధి కూలీలకు ఒక మేట్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వీబీ-జీ రామ్ జీ పథకం కింద అనుమతించిన 375 రకాల పనులపై సర్పంచులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి వికాస్ మీనా, వీబీ-జీ రామ్ జీ జాయింట్ కమిషనర్, గ్రామీణాభివృద్ధి కమిషనరేట్ హైదరాబాద్ మోరె శ్రీనివాస్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎం. సంపత్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, పంచాయతీరాజ్ డైరెక్టర్లు బైరెడ్డి భగవాన్ రెడ్డి, గుమ్మడి సోమయ్య, డీఆర్డీఓ చంద్రశేఖర్, డీపీఓ వెంకయ్య, సర్పంచులు, ఎంపీడీవోలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Also Read: సెమీస్ కోసం సమరమే.. యూఏఈతో భారత్ ఢీ!

Please tell us what is wrong. Your report will be sent to the website team.

