వహీదున్నీసా బేగం
* 80 ఏళ్ల వృద్ధురాలి ఆవేదన..
* కోర్టు తీర్పు అమలుకు పదేళ్లుగా ఎదురుచూపులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: వయసు మీదపడింది.. శరీరం సహకరించడం లేదు.. కనీసం నడవలేని పరిస్థితి. జీవిత చరమాంకంలో కన్నబిడ్డల ఆదరణ పొందాల్సిన తల్లి, వారి నిరాదరణతో న్యాయం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది. తనకు రావాల్సిన భరణం, ఇతర న్యాయపరమైన ప్రయోజనాలు ఇప్పించాలంటూ పదేళ్లుగా పోరాడుతున్న 80 ఏళ్ల వృద్ధురాలు చివరకు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఇక తిరిగే ఓపిక లేదని, నిద్రమాత్రలు మింగి ప్రాణాలు తీసుకోవాలనిపిస్తోందని సోమవారం హైదరాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి (Prajavani) కార్యక్రమంలో కన్నీటిపర్యంతమయ్యారు.
పదేళ్లుగా న్యాయం కోసం పోరాటం
సైదాబాద్‌లోని డాక్టర్ జాకీర్ హుస్సేన్ కాలనీకి చెందిన వహీదున్నీసా బేగం (80) భర్త మీర్ ఆజంఅలీ మరణించిన తర్వాత ఒంటరిగా మిగిలిపోయారు. ఆమెను ఆదుకోవాల్సిన నలుగురు కుమారులు బాధ్యతలను విస్మరించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుమారుల నిరాదరణతో విసిగిపోయిన ఆమె 2016లో హైదరాబాద్ నాలుగో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయస్థానం ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది. నెలవారీ భరణం (Maintenance) చెల్లించడంతోపాటు ఇంటి అద్దె భరించాలని, రూ.లక్ష పరిహారం ఇవ్వాలని, కంటి ఆపరేషన్ చేయించాలని కుమారులను ఆదేశించింది.
కోర్టు తీర్పు ఉన్నా.. తీరని కష్టాలు
న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసి ఏళ్లు గడుస్తున్నా వాటి అమలు మాత్రం జరగడం లేదని వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంటి చూపు మందగిస్తున్నా ఆపరేషన్ చేయించేవారు లేరని, కనీస అవసరాలకు కూడా డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నానని వాపోయారు. కోర్టు తీర్పును అమలు చేయించాలని ఇప్పటికే నాలుగుసార్లు కలెక్టరేట్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ ఆర్డీఓ (RDO)ను సైతం కలిసి తన సమస్యను వివరించారు. అయినప్పటికీ పరిష్కారం లభించలేదని ఆవేదన చెందుతున్నారు.
ఐదోసారి వీల్‌చైర్‌లో కలెక్టరేట్‌కు..
సోమవారం ఐదోసారి వీల్‌చైర్‌లో కలెక్టరేట్‌కు చేరుకున్న వహీదున్నీసా బేగం తనకు రావాల్సిన భరణం, బకాయిలు ఇప్పించాలని, తగిన రక్షణ కల్పించాలని కలెక్టర్‌ను వేడుకున్నారు. పదేళ్లుగా న్యాయం కోసం తిరుగుతున్నా తన సమస్య పరిష్కారం కాకపోవడంతో జీవితంపై ఆశ కోల్పోతున్నానని కన్నీటిపర్యంతమయ్యారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు అండగా నిలవాల్సిన కుమారులు బాధ్యత విస్మరించడం, కోర్టు ఆదేశాల అమలులో జరుగుతున్న జాప్యం ఈ ఘటనలో చర్చనీయాంశంగా మారాయి.
Also Read: సెమీస్ కోసం సమరమే.. యూఏఈతో భారత్ ఢీ!

Please tell us what is wrong. Your report will be sent to the website team.

