వెట్టిచాకిరీ విడుదల ధ్రువీకరణ పత్రాలు అందజేసిన కలెక్టర్
* వెట్టిచాకిరీ విడుదల ధ్రువీకరణ పత్రాలు అందజేసిన కలెక్టర్
* నెల్లూరు జిల్లా కలెక్టర్ తో మాట్లాడి, బాధితులను ప్రత్యేక వాహనంలో స్వగ్రామాలకు తరలింపు.. కలెక్టర్ కు బాధితుల కృతజ్ఞతలు
ఆకేరు న్యూస్, కమలాపూర్ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని సిమెంట్ వర్క్‌షాప్‌లో వెట్టిచాకిరికి (Vetti Chakiri) గురైన బాధితులందరికీ శుక్రవారం జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ 16 మందికి వెట్టిచాకిరీ (Vetti Chakiri) విడుదల ధ్రువీకరణ పత్రాలు (రిలీజ్ సర్టిఫికెట్లు) అందజేసి, వారిని వెట్టిచాకిరీ నుంచి విముక్తులను చేశారు. ప్రస్తుత సమాజంలోనూ కొనసాగుతున్న వెట్టిచాకిరీ అనే సాంఘిక దురాచారంపై ఆమె ఉక్కుపాదం మోపి, పేద కార్మికుల పాలిట ఆమె భరోసాగా నిలిచారు.

కేవలం విడుదల పత్రాలు ఇవ్వడమే కాకుండా, స్వయంగా నెల్లూరు జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి బాధితులను సురక్షితంగా ప్రత్యేక వాహనంలో పంపిస్తున్న సమాచారాన్ని అందించారు. ప్రయాణంలో భోజనం, చిన్నపిల్లలకు పాలు తదితర సౌకర్యాలు కల్పించడం ద్వారా కలెక్టర్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. తమకు పునర్జన్మ ప్రసాదించిన కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్‌కు, అధికారులకు బాధిత కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపాయి.
అరకొర కూలీతో బందీలుగా మారిన వీరి దీనస్థితిపై సమాచారం అందిన వెంటనే కలెక్టర్ అధికారులను అప్రమత్తం చేయడంతో నిన్న మండల స్థాయి బృందం తనిఖీలు నిర్వహించి బాధితులను రక్షించి హనుమకొండ ఆర్డీవో వెంకటేష్ ఎదుట హాజరుపరిచింది.

* ఆప్యాయంగా మాట్లాడి..
ఈ సందర్భంగా విముక్తి పొందిన కార్మిక కుటుంబాలతో కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ ఆప్యాయంగా మాట్లాడారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇస్తూ, మరోసారి ఎవరినీ నమ్మి మోసపోవద్దని, ఎక్కడా ఇలాంటి వెట్టిచాకిరీ పనులు చేయొద్దని సూచించారు. మద్యం లాంటి వ్యసనాలకు దూరంగా ఉంటూ, పిల్లల భవిష్యత్తు బాగుండేలా వారిని బాగా చదివించాలని, స్వేచ్ఛగా పని చేసుకుంటూ ఆత్మగౌరవంతో జీవించాలని ఆమె పిలుపునిచ్చారు.
*చట్ట ప్రకారం కేసు నమోదుకు ఆదేశాలు..
అంతేకాకుండా, కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన కంపెనీ యజమాని శివకుమార్‌పై చట్ట ప్రకారం కేసు నమోదు చేయాలని ఆర్డీవో వెంకటేష్, కార్మికులు పనిచేసిన దినాలకు పూర్తి కూలీ డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖ అధికారులను ఆదేశించి బాధితులకు న్యాయం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రవి, ఆర్డీవో వెంకటేష్, కమలాపూర్ తహసీల్దార్ సురేష్ కుమార్, సహాయ కార్మిక అధికారి శర్ఫుద్దీన్, ఇతర అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
Also Read : చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

Please tell us what is wrong. Your report will be sent to the website team.

